మన టాలీవుడ్‌లో మంచి కామిక్ టైమింగ్ ఉన్న నటుల్లో విశ్వక్ సేన్ ఒకడు. సందు దొరికితే చాలు.. సెటైరికల్ పంచ్‌లతో గిలిగింతలు పెట్టించేస్తాడు. లేటెస్ట్‌గా చోర్ బజార్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లోనూ ఇతను ఏకంగా యాంకర్ ఉదయ భానుపైనే ఛలోక్తులు పేల్చి నవ్వులు పూయించేశాడు. ఈ ఈవెంట్‌కి అతిథిగా విచ్చేసిన విశ్వక్ సేన్‌ను ఉదయ భాను వేదిక మీదకి పిలిచింది. అతడు రాగానే, సినిమాల్లో కన్నా రియల్‌గానే చూడ్డానికి చాలా బాగున్నావంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చింది.
అప్పుడు విశ్వక్ సేన్ వెంటనే మైక్ అందుకొని, ‘మిమ్మల్ని చూసే పెరిగాను’ అంటూ బాంబ్ పేల్చాడు. పాపం, అందుకు ఏం బదులివ్వాలో తెలీక ఆ యాంకరమ్మ అతనితో పాటు నవ్వేసింది. అంతటితో ఆగలేదు.. చిన్నప్పటి నుంచి ఉదయ భానుని చూడాలనుకున్నానని, ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత తన కోరిక తీరిందని చెప్పాడు. అందుకు కౌంటర్ వేయాలన్న ఉద్దేశంతో.. ‘‘నేను కూడా మిమ్మల్ని చాలా రోజుల నుంచి చూడాలనుకున్నా, మొత్తానికి ఇప్పుడు కలుసుకున్నా’’ అని ఉదయ భాను చెప్పింది. ఈ పాయింట్‌ని కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటూ.. ‘మీరు చిన్నగా ఉన్నప్పుడు నేను పుట్టలేదు’ అనే చెప్పేశాడు.
ఆ దెబ్బకు ఉదయ భాను ముఖం మళ్లీ తేలిపోయింది. ఆ పంచ్‌ను కవరప్ చేసేందుకు.. ‘మీకు నాకు నాలుగైదేళ్లు తేడా ఉంటుందిలెండి’ అంటూ ప్రయత్నాలు చేసింది. కానీ, పెద్దగా ఫలించలేదు. అప్పటికే విశ్వక్ వేసిన జోక్ బాగా పేలడంతో, వేదికలో నవ్వులు పూస్తూనే ఉన్నాయి. ఇంకా లాగితే బాగుండదని అనుకున్నాడు ఏమో గానీ, ఇక్కడితో రోస్టింగ్ ఆపేద్దామని విశ్వక్ చెప్పడంతో.. ఉదయ భాను ఈవెంట్‌ని కొనసాగించింది.