Vishnu Priya Comments On Casting Couch: ఇండస్ట్రీలో కొత్తగా అడుగుపెట్టే అమ్మాయిల్లో చాలామంది కాస్టింగ్ కౌచ్‌ని ఎదుర్కొంటుంటారు. కోరిక తీరిస్తేనే ఆఫర్.. లేదంటే అవకాశాలు ఇవ్వమని కొందరు దుండగులు లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వాటికి భయపడి చాలామంది భామలు వెనకడుగు వేస్తుంటారు. ఇండస్ట్రీలో రాణించాలన్న తమ కలని చంపుకొని, ఇతర రంగాల్లోకి వెళ్లిపోతుంటారు. కానీ, కొందరు మాత్రం అలా కాదు. ధైర్యంగా ఆ పరిస్థితుల్ని ఎదుర్కొని, ఇండస్ట్రీలో ముందుకు సాగుతుంటారు. తానూ అదే పని చేశానని యాంకర్ కమ్ నటి విష్ణు ప్రియ చెప్పుకొచ్చింది. తనని కూడా చాలామంది కోరిక తీర్చమని అడిగారని, అందుకు ఒప్పుకోకపోవడంతో చాలా అవకాశాలు వదులుకోవాల్సి వచ్చిందని ఈ అమ్మడు బాంబ్ పేల్చింది.
‘‘కాస్టింగ్ కౌచ్ అనేది ఒక్క సినీ పరిశ్రమలోనే కాదు, ప్రతిచోటా ఉంది. కానీ, అది ఎంపిక చేసుకోవాలా? వద్దా? అనేది ఆడవాళ్ల చేతిలోనే ఉంటుంది. నాక్కూడా ఆఫర్స్ వస్తున్న సమయంలో చాలామంది కోరిక తీర్చమని అడిగారు. కానీ, నేను అందుకు ఒప్పుకోలేదు. దాని వల్ల చాలా ఆఫర్లు కోల్పోవాల్సి వచ్చింది’’ అని విష్ణు ప్రియ చెప్పుకొచ్చింది. టాలెంట్‌ని నమ్ముకొని తాను ముందడుగు వేశానని, తన కష్టంతో ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపింది. ఇదే సమయంలో ఇండస్ట్రీలో పురుషాధిక్యం ఎక్కువగానే ఉందని, అది పోవడానికి ఇంకా చాలా టైం పడుతుందని తెలిపింది. ఆడవాళ్లు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారని, ఇంకా 15-20 ఏళ్లలో ఆడవాళ్లు మగవాళ్లకి గట్టి పోటీనిస్తారని తెలిపింది. ఇక తనని యాంకర్ అని పిలిపించుకోవడం ఇష్టం ఉండదని.. ఎందుకంటే తనకంటే బాగా మాట్లాడే తెలుగు యాంకర్స్ చాలామంది ఉన్నారని, వారికి సమానంగా యాంకర్ అని పిలిపించుకోని ఆ పదం విలువ తీయలేనని విష్ణు ప్రియ వ్యాఖ్యానించింది.