కంగనా రనౌత్, అరవింద్ స్వామి నటించిన “తలైవి” సినిమా సెప్టెంబర్ 10న తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానుంది. నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ”నిర్మాత విష్ణుకి సినిమాలపై మక్కువ ఎక్కువ. వారు సినిమా గురించి చాలా పరిశోధన చేసారు. కంగనాను జయలలిత పాత్ర కోసం నేను సిఫార్సు చేశాను. అయితే ఈ సినిమాలో నేను కంగనాను నటించవద్దని చెప్పాను. కేవలం తనలాగే ఉండమని అన్నాను. ఆమె వెంటనే దానికి అంగీకరించింది. అలాగే జయలలిత పాత్రలో ఒదిగిపోయింది. ఆమె ఒక రోజు టాప్ చైర్‌పై ఉంటుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను” అంటూ కంగనా పై ప్రశంసల జల్లు కురిపించారు.
Read Also : జయలలిత లాంటి స్ట్రాంగ్ లేడీగా నటించడం నా అదృష్టం : కంగనా రనౌత్
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆరు సార్లు పని చేసిన నటి, రాజకీయవేత్త జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం “తలైవి”. ఏకకాలంలో తమిళ, హిందీ, తెలుగు భాషలలో తెరకెక్కించారు. దీనికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. విజయేంద్ర ప్రసాద్, మధన్ కార్కీ (తమిళం), రజత్ అరోరా (హిందీ) రచించారు. “తలైవి”ని విబ్రి మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లపై విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ సంయుక్తంగా నిర్మించారు.
Read Also : తలైవిలో నటించడం అద్భుతమైన అనుభవం: అరవింద్ స్వామి
ఈ చిత్రాన్ని జయలలిత జయంతి 2019 ఫిబ్రవరి 24 నాడు అధికారికంగా ప్రారంభించారు. మొదట్లో ఈ సినిమాకి తమిళంలో “తలైవి”, హిందీ, తెలుగు భాషలలో “జయ” అని పేరు పెట్టారు. కానీ మేకర్స్ తరువాత మూడు భాషలలో “తలైవి” పేరుతోనే విడుదల చేయాలని భావించారు. 2019 నవంబర్ 10 న షూటింగ్ ప్రారంభించిన మేకర్స్ డిసెంబర్ 2020 లో పూర్తి చేశారు. ముందుగా ఈ చిత్రాన్ని 2021 ఏప్రిల్ 31న థియేట్రికల్ రిలీజ్‌కు షెడ్యూల్ చేశారు. ఏప్రిల్ 2021 నాటికి మహారాష్ట్రలో కరోనా కేసులు, లాక్‌డౌన్ కారణంగా సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. దీంతో 10 సెప్టెంబర్ 2021న విడుదల చేయడానికి రీ షెడ్యూల్ చేశారు.