తెలుగు సినిమా చూసిన మొట్ట మొదటి లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ విజయశాంతి. హీరోల పక్కన పాటల్లో డాన్స్ మాత్రమే కాదు లేడీ ఓరియెంటడ్ సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా నటించగలనని నిరూపించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది విజయశాంతి. స్టార్ హీరోల పక్కన నటించి, ఆ తర్వాత తనే ఒక స్టార్ గా ఎదిగిన విజయశాంతి సినిమాల నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు అప్పటికి ఉన్న స్టార్ హీరోలందరితో నటించిన విజయశాంతి… ఎన్టీఆర్-ఏఎన్నార్ లకి మాత్రం హీరోయిన్ గా నటించలేదు. సత్యం శివం సినిమాలో విజయశాంతి, ఎన్టీఆర్-ఏఎన్నార్ లకి చెల్లిగా నటించింది. ఎన్టీఆర్ జయంతి నాడు తారకరాముడితో తనకున్న జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ విజయశాంతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
“విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న తారక రామారావు గారు డాక్టర్ ఎన్టీఆర్ గారు… నేను 14 సంవత్సరాల చిన్న పిల్లగా, నా సినిమా జీవిత ప్రయాణ ప్రారంభ సంవత్సరాలలో సత్యంశివం సినిమాలో చెల్లెలిగా ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారితో కలిసి నటించే అవకాశం కలిగింది సుమారు 1980లో… ఆ తర్వాత 1985లో నా ప్రతిఘటన చిత్రానికి ఉత్తమనటిగా నంది అవార్డును ఎన్టీఆర్ గారే ముఖ్యమంత్రిగా నాకు అందించి, అభినందించి, ప్రజాప్రాయోజిత చిత్రాలలో మరింతగా కొనసాగాలని ఆశీర్వదించారు. నటునిగా, నాయకునిగా వారిది తిరుగులేని జీవన ప్రస్తానం. ఇక ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వానికి చిన్న ఉదాహరణ… బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రం డబ్బింగ్ ఎన్టీఆర్ గారు ఏవీఎం స్టూడియోలో చెబుతున్నప్పుడు 1990లో నేను చిరంజీవిగారితో అదే స్టూడియోలో సినిమా చేస్తూ వారిని డబ్బింగ్ థియేటర్‌లో కలవడానికి వెళ్లినప్పుడు,డబ్బింగ్ థియేటర్ యొక్క వెలుతురు లేని వాతావరణంలో వారు నన్ను సరిగా గమనించలేదని బాధపడ్డాను… అయితే ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ గారు తర్వాతి రోజు ఉదయం 6 గంటలకే మద్రాసులో మా ఇంటికి వచ్చి, (నేను ఆ ఉదయం ప్లయిట్‌కి హైదరాబాదులో షూటింగ్‌కి వెళ్లాను) అమ్మాయిని మేము చూసుకోలేదు. పొరపాటు జరిగింది, ఐయామ్ సారీ, బిడ్డకు తెలియజేయండి అని శ్రీనివాస్ ప్రసాద్ గారితో చెప్పిన సంఘటన ఎన్ని సంవత్సరాలైనా గుర్తుగానే, గౌరవంగానే మిగులుతాది. అంతేగాక, ఆ రోజు నేను హైదరాబాదులో ఉన్న ఫోన్ నెంబర్ తెలుసుకుని, ఫోన్ చేసి మరీ “జరిగింది పొరపాటు మాత్రమే అమ్మా, I am extremely sorry …” అని చెప్పినంతవరకూ.. సాటి కళాకారుల గౌరవాన్ని కాపాడే బాధ్యతను విస్మరించని ఆ మహోన్నత వ్యక్తిని ఎంతగా ప్రశంసించినా తక్కువే. ఎన్టీఆర్ గారు మద్రాస్ వచ్చిన సందర్భాలలో మధ్యాహ్నం 11 గంటలకల్లా లంచ్ మా ఇంటి నుంచి శ్రీనివాస్ ప్రసాద్ గారు పంపడం, ఎన్టీఆర్ గారు ఎంతో ఆప్యాయంగా స్వీకరించటం జరిగేది. అదే గాకుండా, నేను వారిని కలవడానికి హైదరాబాదులో ఎంతో బిజీగా ఉన్న సమయంలో వెళ్లినా కూడా స్వయంగా టిఫిన్ వడ్డించి తినిపించేవారు. ఆయన ఆతిథ్యానికి మారుపేరు . ఆదరాభిమానాలకు మరో రూపు… ఎన్టీఆర్ గారు బహుశా ప్రపంచం తిరిగి ఎప్పటికీ చూడలేని అరుదైన ఒక కారణజన్ముడు, యుగపురుషుడు. 100 సంవత్సరాలైనా… మరో వంద సంవత్సరాలైనా… సినిమాకి ఎన్టీఆర్ నేర్పిన క్రమశిక్షణా విధానాలు ఎప్పటికీ శిరోధార్యాలే… సినిమా కళాకారులకు వారు నిర్దేశించిన ప్రమాణాలు నిరంతరం ప్రాతఃస్మరణీయాలే…” అంటూ విజయశాంతి అన్నగారితో ఉన్న మెమొరీస్ ని షేర్ చేసుకుంది.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న తారక రామారావు గారు
డాక్టర్ ఎన్టీఆర్ గారు…
నేను 14 సంవత్సరాల చిన్న పిల్లగా, నా సినిమా జీవిత ప్రయాణ ప్రారంభ సంవత్సరాలలో సత్యంశివం సినిమాలో చెల్లెలిగా ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారితో కలిసి నటించే అవకాశం కలిగింది సుమారు 1980లో… pic.twitter.com/5jZari2c62
— VIJAYASHANTHI (@vijayashanthi_m) May 27, 2023