Vijay Fans Mixed feelings after announcing his political Party: చాలా కాలంగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ తమిళ స్టార్ హీరో అక్కడ అభిమానులందరూ తలపతి విజయ్ గా పిలుచుకునే విజయ్ జోసెఫ్ కుమార్ తన పొలిటికల్ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి గత ఎన్నికల్లోనే విజయ్ రాజకీయ ఆరంగ్రేటం చేస్తాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానికి ఊతం ఇస్తూ విజయ్ తండ్రి అప్పట్లో కొన్ని పొలిటికల్ మీటింగ్స్ కూడా పెట్టారు. విజయ్ తండ్రి చంద్రశేఖర్ విజయ్ అభిమానులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉండటంతో తన తండ్రికి తన పొలిటికల్ ఎంట్రీకి ఎలాంటి సంబంధం లేదంటూ విజయ్ షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు. అప్పట్లో తండ్రి కొడుకుల మధ్య వివాదాలు అంటూ పెద్ద ఎత్తున తమిళ మీడియా హైలెట్ కూడా చేసింది. కానీ ఇప్పుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ కి అంతా సిద్ధం చేసుకుని ఎన్నికల సంఘం దగ్గర పార్టీని రిజిస్టర్ చేసిన తర్వాత అధికారికంగా ప్రకటన చేశారు. పొలిటికల్ పార్టీ ప్రకటించిన తర్వాత ఈ పార్లమెంటు ఎన్నికల్లో తమిళనాడులోని ఏ ప్రాంతీయ పార్టీకి గాని వ్యక్తులకి గాని మద్దతు ఇవ్వడం లేదని విజయ ప్రకటించారు. అంతే కాదు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం తమ కొత్త పార్టీ పోటీ చేయడం లేదని ప్రకటించారు.
ఆ తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తామని అన్నారు.. అయితే విజయ్ పొలిటికల్ పార్టీ ప్రకటనతో అభిమానులందరూ ఒక రకమైన స్వీట్ షాక్ కి గురయ్యారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న వారికి ఒకపక్క గుడ్ న్యూస్ అనిపిస్తున్నా సరే లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న ప్రస్తుత సినిమా విజయ్ కి చివరి సినిమా అని ప్రకటించడంతో వారంతా సంతోషించాలో బాధపడాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే కొంత మంది అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున టపాసులు పేలుస్తూ స్వీట్స్ పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి తమిళనాడు వ్యాప్తంగా కనిపిస్తోంది.. నిజానికి తమిళనాడు రాజకీయాల్లో సినీ నటుల హవా ఎక్కువగా కొనసాగుతూ వచ్చింది. ముందుగా ఎంజీఆర్ తర్వాత జయలలిత వంటి వారు సినిమాల ద్వారానే ప్రేక్షకులకు బాగా దగ్గరయి చాలా కాలం పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి -దివంగత కరుణానిధి సైతం సినిమా రచయితగానే తన ప్రజలకు దగ్గరయ్యారు. అయితే మధ్యలో రజనీకాంత్ పార్టీ ప్రకటన చేసి అనారోగ్యం దృష్ట్యా తాను పార్టీని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే మరోపక్క కమల్ హాసన్ పార్టీ ప్రకటించారు కానీ ఎన్నికల్లో పోటీ చేసినా పెద్దగా ప్రభావం అయితే చూపించలేక పోయారు. మరి విజయ్ కి ఈ పాలిటిక్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకు క్లారిటీ రావడం కష్టమే.