Vijay : విజయ్ విజృంభణ సాగేనా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిభ ఎక్కడ ఉన్నా, పట్టుకు వచ్చి మరీ పట్టం కట్టడంలో తెలుగువారు అందరికంటే ముందుంటారు. ఇక సినిమా రంగంలోవారినైతే మరింతగా ఆదరిస్తారు. అలా తెలుగువారి ఆదరణ చూరగొంటున్న అదృష్టవంతుల్లో తమిళ టాప్ స్టార్స్ లో ఒకరైన విజయ్ చోటు సంపాదించాడు. నిజానికి విజయ్ ఒక్క తెలుగు చిత్రంలోనూ హీరోగా నటించలేదు. కానీ, ఆయన నటించిన సినిమాలు తెలుగులోకి అనువాదమై ఇక్కడి వారినీ అలరిస్తున్నాయి. విజయ్ కి తెలుగు సినిమా రంగంతో సంబంధం లేదని చెప్పలేం. ఎందుకంటే విజయ్ తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ తెలుగు చిత్రసీమలో దర్శకునిగా సాగారు. చిరంజీవి హీరోగా చంద్రశేఖర్ దర్శకత్వంలో “చట్టానికి కళ్ళు లేవు, పల్లెటూరి మొనగాడు, దేవాంతకుడు” సినిమాలు రూపొంది అలరించాయి. ప్రస్తుతం విజయ్ అనువాద చిత్రాలకు తెలుగునాట మంచి మార్కెట్ ఉంది.
విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. 1974 జూన్ 22న మద్రాసులో జన్మించాడు. ఆయన తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ పేరున్న దర్శకుడు. తల్లి శోభాచంద్రశేఖర్ రచయిత్రి. ఆమె కథతోనే ‘చట్టానికి కళ్ళులేవు’ సినిమా తెరకెక్కింది. విజయ్ బాల్యంలోనే ఎంతో చురుగ్గా ఉండేవాడు. ఏది చెప్పినా ఇట్టే గ్రహించేసే వాడు. అతనిలోని ఆ చురుకుదనాన్ని చూసి, తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ తాను తెరకెక్కించిన “వెట్రి, కుడుంబం, వసంతరాగం, సట్టం ఒరు విలయాట్టు, ఇదు ఎంగల్ నీతి, నాన్ సిగప్పు మనిదన్” వంటి చిత్రాలలో విజయ్ ని బాలనటునిగా నటింప చేశారు. ఆ సినిమాలతోనే విజయ్ మంచి పేరు సంపాదించాడు. చంద్రశేఖర్, శోభ దంపతులు తమ తనయుడు విజయ్ ని హీరోగా చూడాలని తపించారు. అందుకోసం శోభ కథను తయారు చేసి, నిర్మాతగా మారితే, తండ్రి చంద్రశేఖర్ మెగాఫోన్ పట్టి, ‘నాలై తీర్పు’ చిత్రం రూపొందించారు. ఈ సినిమా విజయ్ కి మంచి మార్కులే సంపాదించి పెట్టింది. ‘రసిగన్’ చిత్రంలో మరోమారు తండ్రి దర్శకత్వంలో నటించిన విజయ్ కు విమర్శకుల ప్రశంసలు లభించకున్నా, కావలసిన కమర్షియల్ సక్సెస్ దరి చేరింది.
Also Read
విక్రమన్ రూపొందించిన ‘పూవే ఉనక్కాగ’ సినిమాతో నటునిగానూ, హీరోగానూ మంచి మార్కులు సంపాదించిన విజయ్ ఆ తరువాత నుంచీ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. బాలశేఖరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ టుడే’ సినిమాతో మరో ఘనవిజయం విజయ్ సొంతమయింది. ఇదే చిత్రం తెలుగులో పవన్ కళ్యాణ్ తో ‘సుస్వాగతం’గా రూపొందింది. ఆ తరువాత నుంచీ విజయ్ వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగారు. ఆరంభంలో విజయ్, అజిత్ కలసి నటించారు. తరువాత వారిద్దరి మధ్యనే బాక్సాఫీస్ వార్ మొదలయింది. ఎమ్జీఆర్ – శివాజీ గణేశన్, రజనీకాంత్ – కమల్ హాసన్ తరువాత బాక్సాఫీస్ వద్ద విజయ్ – అజిత్ జోడీకే మంచి పోటీ నెలకొందని చెప్పవచ్చు. అందుకు తగ్గట్టుగానే విజయ్ -అజిత్ ఫ్యాన్స్ మధ్య కూడా సోషల్ మీడియాలో వార్ సాగుతూ ఉంటుంది.
విజయ్ తమిళంలో నటించిన కొన్ని చిత్రాలు తెలుగులో రీమేక్ అయి, ఇక్కడా విజయభేరీ మోగించాయి. అలాంటి వాటిలో పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ ఒకటి. తెలుగులో ఘనవిజయం చూసిన మహేశ్ ‘ఒక్కడు’ చిత్రం తమిళంలో విజయ్ తో ‘గిల్లీ’గా, ‘పోకిరి’ చిత్రం విజయ్ తో ‘పోక్కిరి’గా తెరకెక్కి అనూహ్య విజయం సాధించాయి. దాంతో విజయ్ స్టార్ స్టేటస్ మరింత గట్టి పడింది. ‘ఇలయ దళపతి’గా అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించిన విజయ్ తమిళ రాజకీయాలను సైతం ప్రభావితం చేయగలడని పలు సర్వేలు తెలిపాయి. ఆయన తండ్రి చంద్రశేఖర్ “విజయ్ రాజకీయాల్లోకి వస్తాడని” ప్రకటించాడు కూడా. అయితే విజయ్ మాత్రం ప్రస్తుతానికి తాను నటనలోనే కొనసాగుతానని చెప్పాడు. ఈ యేడాది ‘బీస్ట్’తో జనాన్ని పలకరించిన విజయ్, ఈ మధ్య హైదరాబాద్ షూటింగ్ వచ్చారు. ఆ సినిమాకు మన తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకుడు, దిల్ రాజు నిర్మాత. ఆ షూటింగ్ సమయంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును, విజయ్ కలుసుకోవడం విశేషంగా మారింది. పలు రాజకీయ పార్టీలు విజయ్ ను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించాయి . కేంద్రప్రభుత్వం పైనా విజయ్ విమర్శలు చేస్తూనే ఉన్నాడు. తన సినిమాల్లోనూ వదలడం లేదు. మరి రాబోయే కాలంలో విజయ్ ఏ రోజునైనా రాజకీయాల్లోకి రావచ్చునని తమిళనాట విశేషంగా వినిపిస్తోంది. మరి అదెప్పుడో చూడాలి?
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!