దళపతి విజయ్ తాజా చిత్రం ‘బీస్ట్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ ప్రెస్టేజియస్ మూవీలో శుక్రవారం హీరోయిన్ పూజా హెగ్డే పార్ట్ షూటింగ్ పూర్తి కాగా, ఈ రోజు విజయ్ సైతం షూట్ కు గుడ్ బై చెప్పేశారు. ‘బీస్ట్’తో కోలీవుడ్ కు రీ-ఎంట్రీ ఇస్తున్న పూజా హెగ్డే తన ఫీలింగ్స్ ను ఓ చిన్నపాటి వీడియో ద్వారా తెలియచేస్తే, హీరో విజయ్ దర్శకుడు నెల్సన్ కు ఓ హగ్ ఇచ్చి తన హర్షాన్ని వ్యక్తం చేశాడు. ఈ మూవీ చివరి షెడ్యూల్ చెన్నయ్ లోని గోకులమ్ స్టూడియోస్ లో జరిగింది. అనిరుధ్ రవిచంద్రన్ స్వరపరిచిన పాటతో షూటింగ్ కు చిత్ర బృందం గుమ్మడి కాయ కొట్టేసింది. గత నెలలో దర్శకుడు నెల్సన్ ‘బీస్ట్’ సెట్ కు సంబంధించిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ‘వందో రోజు షూటింగ్’ అని పేర్కొన్నాడు. ఇప్పుడు మొత్తం షూటింగ్ శనివారంతో కంప్లీట్ అయ్యిందని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దర్శకుడు సెల్వ రాఘవన్ సైతం కీలక పాత్ర పోషించిన ‘బీస్ట్’ మూవీ వచ్చే యేడాది వేసవి కానుకగా జనం ముందుకు రాబోతోంది.