Nanna Kutty : గుండెల్ని పిండేస్తున్న విజయ్ ఆంటోని ‘నాన్న కుట్టి’ ట్రైలర్..

Nanna Kutty

Nanna Kutty

వైవిధ్యమైన కథలతో తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ దగ్గరయ్యే హీరో విజయ్ ఆంటోని, ఈసారి తండ్రీకూతుళ్ల అనుబంధంతో కన్నీళ్లు పెట్టించడానికి సిద్ధమయ్యారు. ఆయన, ప్రీతీ అస్రానీ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘నాన్న కుట్టి’. ము. మారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 27న సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా తెలుగులో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, ఒక్క డైలాగ్‌తోనే ప్రేక్షకుల హృదయాలను బరువెక్కిస్తోంది. “దియా, నీకు అమ్మ అంటే చాలా ఇష్టమా?” అని తండ్రి అడగడం.. దానికి పాప ఇష్టమని చెప్పడం.. “నువ్వు చిన్నప్పటి నుంచి అమ్మను చూడలేదు కదా?” అని తండ్రి ప్రశ్నిస్తే, “నీకు దేవుడంటే ఇష్టం కదా నాన్న కుట్టి? నువ్వు దేవుడ్ని చూశావా నాన్న కుట్టి?” అంటూ ఆ చిన్నారి ఇచ్చే సమాధానంతో ట్రైలర్ మొదలవుతుంది. ఈ ఒక్క సంభాషణతోనే సినిమాలో ఎమోషన్ ఏ స్థాయిలో ఉండబోతోందో స్పష్టమైంది. కేవలం సెంటిమెంట్ మాత్రమే కాకుండా, “మా నాన్న ఎంత పెద్దోడో తెలుసా?” అనే డైలాగ్ ద్వారా మాస్, యాక్షన్, కామెడీ అంశాలను కూడా దర్శకుడు సమపాళ్లలో జోడించినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత ఫాతిమా విజయ్ ఆంటోని చేసిన వ్యాఖ్యలు అందరినీ కదిలించాయి. “‘నాన్న కుట్టి’ చిత్రాన్ని మగవాళ్లందరికీ అంకితం చేస్తున్నాను. పదేళ్ల వయసులో నాన్న విలువ తెలియదు కానీ, 20, 30 ఏళ్లు దాటాకే ఆయన గొప్పదనం అర్థమవుతుంది. చిన్నతనంలోనే మా నాన్న మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. తల్లిదండ్రులు ఉన్నవాళ్లే ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతులు” అంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు. హీరోయిన్ ప్రీతీ అస్రానీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. “అమ్మ ప్రేమను అందరూ సెలెబ్రేట్ చేస్తారు, కానీ నాన్న త్యాగాన్ని అంతగా గుర్తించరు. నాన్న గొప్పదనాన్ని చాటిచెప్పే చిత్రమిది” అని చెప్పారు. విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. “‘నాన్న కుట్టి’ అద్భుతంగా వచ్చింది. ఫస్ట్ హాఫ్ సరదాగా, హ్యూమర్‌తో సాగుతుంది. సెకండాఫ్ మాత్రం పూర్తిగా ఎమోషనల్‌గా ఉంటుంది. బేబీ లిథాన్య పాత్రకు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది” అని ధీమా వ్యక్తం చేశారు. తెలుగులో సినిమాను రిలీజ్ చేస్తున్న సురేష్ బాబుకు, మాటలు-పాటలు అందించిన బాష్యశ్రీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని సమర్పణలో ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రానికి రామంజనేయులు జవ్వాజీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ వేడుకలో దర్శకుడు ము. మారన్, ‘కిష్కింధపురి’ డైరెక్టర్ కౌశిక్, లారా విజయ్ ఆంటోని పాల్గొని సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. నవంబర్ 27న థియేటర్లలోకి వస్తున్న ఈ ‘నాన్న కుట్టి’ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఏ స్థాయిలో కట్టిపడేస్తుందో చూడాలి!