కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ని స్టార్ హీరోగా మార్చిన సినిమా బిచ్చగాడు. తమిళ్ తో పాటు తెలుగులోనూ డబ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకొని విజయ్ కి మంచి పేరు తీసుకొచ్చిపెట్టింది. ఇక ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న చిత్రం బిచ్చగాడు 2. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా థీమ్ సాంగ్ యాంటీ బికిలీ ఎవరు..? అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తికరంగా మారింది.
ఇక తాజాగా యాంటీ బికిలీ ఎవరు అనేది థీమ్ సాంగ్ తో చెప్పేశారు మేకర్స్. బిచ్చగాడు లో తల్లి కోసం కోట్ల రూపాయలను వదిలి బిచ్చగాడిలా మారిన హీరో.. ఇప్పుడు ఆ బిచ్చగాళ్ల కోసం యాంటీ బికిలీ అనే పేరుతో ఒక మిషన్ ని మొదలుపెడతాడు. అందులో భాగంగానే ఒక ధనవంతుడు .. బిచ్చగాడిగా మారి.. వారి సమస్యలు తెలుసుకోవడానికి బయల్దేరతాడు. ఇతడే యాంటీ బికిలీ అని తెలుస్తోంది. ఇక ఇతగాడి లక్ష్యమేంటీ అనేది కూడా థీమ్ సాంగ్ లో తెలిపారు. చరిత్రను సంపన్నులు రాశారు. పేదల బతుకులు వాళ్లకు తెలియదు. వస్తున్నాడు చరిత్రను మార్చి రాసేందుకు యాంటీ బికిలీ అంటూ చెప్పుకొచ్చారు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మ సంస్థాపనార్దయా సంభవామి యుగే యుగే శ్లోకం వినిపించడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన కావ్యా థాపర్ నటిస్తోంది. మరి ఈసారి ఈ బిచ్చగాడు ఎలాంటి చరిత్రను సృష్టిస్తాడో చూడాలి.
