బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ కొత్త సినిమా ‘నీయత్’ షూటింగ్ మంగళవారం యూకేలో మొదలైంది. విద్యాబాలన్ టైటిల్ రోల్ ప్లే చేసిన ‘శకుంతలదేవి’ చిత్రాన్ని తెరకెక్కించిన అనూ మీనన్ ‘నీయత్’ సినిమాను డైరెక్ట్ చేస్తోంది. అమెజాన్ ప్రైమ్, అబాండెంటియా ఎంటర్ టైన్ మెంట్, విద్యాబాలన్ కాంబోలో వస్తున్న నాలుగో చిత్రమిది. గతంలో ఈ ముగ్గురి కలయికలో ‘శకుంతల దేవి, షేర్నీ, జల్సా’ చిత్రాలు వచ్చాయి. లేటెస్ట్ మూవీ ‘నీయత్’లో విద్యాబాలన్ డిటెక్టివ్ మీరా రావ్ పాత్రను పోషిస్తోంది. బిలియనీర్ ఆశిష్ కపూర్ బర్త్ డే పార్టీ ఊహించని విధంగా రక్తసిక్తమౌతుంది. ఆశిష్ కపూర్ తో పాటు అతని స్నేహితులు, బంధువులలో ఎవరు దీనికి కారణమనే అంశాన్ని మీరా రావ్ ఎలా నిగ్గు తేల్చిందన్నదే ‘నీయత్’ కథాంశం. ఈ మధ్య కాలంలో తాను చదివిన సూపర్ స్క్రిప్ట్ ఇదని, ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడం ఆనందంగా ఉందని విద్యాబాలన్ ఓ ఫోటోతో పాటు ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొంది. ఈ చిత్రానికి మీనన్, అద్వైత కళ, గీర్వాణీ ధ్యాని కథను అందించగా, కౌసర్ మునీర్ సంభాషణలు రాశారు. ఈ థ్రిల్లర్ మూవీలో రామ్ కపూర్, రాహుల్ బోస్, మిత వశిష్ఠ, నీరజ్ కబి, షహానా గోస్వామి, అమ్రిత్ పురి, దీపానితా శర్మ, శశాంక్ అరోరా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.