Venkatesh: నేచురల్ స్టార్ నానికి చాలా కాలం తర్వాత ఓ గ్రాండ్ సక్సెస్ ‘దసరా’ రూపంలో దక్కింది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ‘దసరా’ ఉత్తరాదిన వండర్స్ సృష్టించకపోయినా… తెలుగులో మాత్రం భారీ ఓపెనింగ్స్ ను తెచ్చిపెట్టింది. అంతేకాదు… నటుడిగా నానిని మరో మెట్టు పైకి ఎక్కించింది. ఈ మూవీతో నాని వందకోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇదిలా ఉంటే… నాని 30వ చిత్రం ఈ యేడాది జనవరి 31న గ్రాండ్ గా మొదలైంది. శౌర్యువ్ దర్శకత్వంలో మోహన్ చెరుకూరి, డా. విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కె. ఎస్. దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్. విశేషం ఏమంటే… శనివారం ఈ సినిమా విడుదల తేదీని నాని స్వయంగా ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే… ఇదేదో తండ్రీ కూతుళ్ళ సెంటిమెంట్ మూవీ అనిపిస్తోంది. నాని గతంలో ‘జెర్సీ’లో ఇలానే తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలిపే పాత్రను పోషించి మెప్పించాడు.
ఇవన్నీ పక్కన పెడితే… ఈ సినిమా విడుదల తేదీనే ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే… డిసెంబర్ 22న విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘సైంథవ్’ విడుదల కాబోతోంది. క్రిస్మస్ కానుకగా దీన్ని ఆ రోజున విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. సరిగ్గా దానికి ఒక్క రోజు ముందు నాని 30వ చిత్రం వస్తున్నట్టు ఇప్పుడు ఈ నిర్మాతలు తెలిపారు. నిజానికి స్టార్ హీరోల సినిమాలు ఒకదాని వెనుక మరొకటి రావడం పెద్ద వింతేమీ కాదు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే… ‘సైంథవ్’ మూవీని డైరెక్ట్ చేస్తోంది నాని నిర్మించిన ‘హిట్, హిట్ -2’ చిత్రాలను తెరకెక్కించిన శైలేష్ కొలను. అంటే తన దర్శకుడి మూడో సినిమా మీదకు పోటీగా నాని 30వ చిత్రం రాబోతోందన్న మాట. పోనీ వీరిద్దరి మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చాయా అనుకుంటే… అదీ లేదు. ఎందుకంటే ‘హిట్ 3’ మూవీని శైలేష్ కొలను దర్శకత్వంలోనే నాని తనే హీరోగా నిర్మించబోతున్నాడు. ‘హిట్ 2’ విడుదల అనంతరం అనేక సందర్భాలలో నాని స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు. కానీ ఇప్పుడు నాని సినిమా రిలీజ్ డేట్ కారణంగా… లేనిపోని అనుమానాలకు తావు ఇచ్చినట్టు అవుతోంది. అన్నట్టు నాని ‘జెర్సీ’లో నటించిన శ్రద్ధ శ్రీనాథే ఇప్పుడు ‘సైంథవ్’లో హీరోయిన్. అయినా డిసెంబర్ చివరి వారం అంటే… ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి… ఈ సినిమా విడుదల తేదీ కాస్తంత అటూ ఇటూ అవుతుందేమో చూడాలి.