Vetrimaaran: లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా ఇంకా చిక్కులోనే నడుస్తున్న విషయం తెల్సిందే. పెళ్లి తరువాత ఈ చిన్నది ఒకపక్క హీరోయిన్ గా.. ఇంకోపక్క నిర్మాతగా కొనసాగుతోంది. తన సినిమాలను తన బ్యానర్ లోనే తెరకెక్కిస్తోంది. ఇక అలా వచ్చిన సినిమానే అన్నపూరిణి. నీలేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన రోజు నుంచే వివాదాలపాలు అవుతూనే వస్తుంది. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన యువతి మాంసాహారం తినడం, వండటం లాంటివి చేయకూడదని మొదలైన వివాదం .. సినిమా రిలీజ్ అయ్యాక.. శ్రీరాముడు మాంసం భుజించాడు అనే డైలాగ్ తో మరింత ఎక్కువ అయ్యింది. దీంతో అన్నపూరిణి.. థియేటర్ నుంచి నెట్ ఫ్లిక్స్ కు వచ్చింది. ఓటిటీ కూడా ఈ చిక్కుల నుంచి కాపాడలేకపోయింది.
ఈ చిత్రం ఒక సామాజిక వర్గ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ ఇది లవ్ జిహాద్‌ను ఆదరించే చిత్రంగా ఉందంటూ ముంబైకి చెందిన శివసేన పార్టీ మాజీ అధ్యక్షుడు రమేష్ సోలంకి ముంబై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక దీంతో ఈ చిక్కులు అన్ని మనకెందుకు అని.. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను తమ ఓటిటీ నుంచి డిలీట్ చేసింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో కనిపించడం లేదు.
ఇక దీనిపై కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ స్పందించాడు. నయన్ కు సపోర్ట్ గా నిలిచాడు. నెట్ ఫ్లిక్స్ చేసింది తప్పు అని బాహాటంగా చెప్పుకొచ్చాడు. ” ఒక సినిమా థియేటర్ కు వచ్చింది అంటే.. సెన్సార్ మొత్తం చూసి.. బయటకు పంపితేనే వస్తుంది. ఏ సినిమాను అయినా బ్యాన్ చేయాలన్నా.. బయటికి పంపాలన్న అది కేవలం సెన్సార్ వల్లే అవుతుంది. కానీ, ఒక సెన్సార్ సర్టిఫికెట్ పొందిన సినిమాను.. నెట్ ఫ్లిక్స్ ఎలా తొలగిస్తుంది. ఇది దారుణమైన చర్య.. చిత్ర పరిశ్రమకు మంచిది కాదు. ఇలా చేయడం వలన సెన్సార్ బోర్డునే ప్రశ్నించినట్లు అవుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.