టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు బాలయ్య ఈ రోజు ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన స్వగృహంలో శ్రీ బాలయ్య తుదిశ్వాస విడిచారు. నిజానికి ఈరోజు ఆయన పుట్టినరోజు. ఇలా బాలయ్య పుట్టినరోజు నాడే తిరిగిరాని లోకాలకు వెళ్లడం అందరినీ కలచి వేస్తోంది. గత కొంతకాలంగా వయసు సహకరించక పోవడంతో నటనకు కూడా దూరంగా ఉంటున్న బాలయ్య ఈ రోజు తుదిశ్వాస విడిచారు.
Read Also : Mannava Balayya : బహుముఖ ప్రజ్ఞాశాలి మన్నవ బాలయ్య!
బాలయ్య నటుడిగా 300కిపైగా చిత్రాల్లో నటించిన ఆయన నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడుగా, కథా రచయితగా ప్రతిభను కనబరిచారు. “ఎత్తుకు పైఎత్తు” చిత్రంతో నటుడుగా మారిన ఆయన ఆ తరువాత యమలీల, అన్నమయ్య, పెళ్లిసందడి, మల్లీశ్వరి, శ్రీరామరాజ్యం లాంటి ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఆయన నిర్మాతగా అమృత ఫిల్మ్స్ సంస్థ ద్వారా శోభన్ బాబుతో చెల్లెలి కాపురం, కృష్ణ హీరోగా కే విశ్వనాధ్ దర్శకత్వంలో నేరము – శిక్ష, చుట్టాలున్నారు జాగ్రత్త, చిరంజీవితో ఊరికిచ్చిన మాట లాంటి పలు చిత్రాలు శ్రీ బాలయ్య నిర్మించారు. దర్శకుడుగా పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు రూపొందించారు. ఉత్తమ కథా రచయితగా ఊరికిచ్చిన మాట చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. చెల్లెలి కాపురం చిత్రానికి నిర్మాతగా నంది అవార్డు అందుకున్నారు. బాలయ్య కుమారుడు తులసీరామ్ కూడా కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. కాగా బాలయ్య మృతి గురించి తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆ బాలయ్య మృతికి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సంతాపం తెలిపారు. ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.