అసలు పేరు కనుమరుగై, కొసరుపేరే నిలచిపోయిన వారు ఎందరో చిత్రసీమలో ఉన్నారు. అంతెందుకు మన మెగాస్టార్ అసలు పేరు కొణిదెల శివశంకర ప్రసాద్. అలా పిలిస్తే చిరంజీవి అభిమానుల్లోనే కొందరు గుర్తుపట్టలేరు. అలాగే సినిమాలోని పాత్ర పేరునే ఇంటిపేరుగా చేసుకొని జనం ముందు నిలిచారు జేడీ చక్రవర్తి. ఆయన అసలు పేరు నాగులపాటి శ్రీనివాసచక్రవర్తి. ఆ పేరు చెబితే ఎవరూ గుర్తు పట్టలేరు. అదే జేడీ చక్రవర్తి అనగానే ఆయన తెరపై కనిపించిన తొలి చిత్రం ‘శివ’ను గుర్తు చేసుకుంటారు జనం. ఆ తరువాత అనేక చిత్రాలలో తనదైన బాణీ పలికిస్తూ సాగారు జేడీ చక్రవర్తి. అతనేమీ నటుల వారసుడు కాదు, నటించాలన్న అభిలాష బలంగా ఉండడంతో అదృష్టం కలసి వచ్చి ‘శివ’ సినిమాలో జేడీగా నటించి ఆకట్టుకున్నారు.
జేడీ చక్రవర్తిగా జనానికి సుపరిచితుడైన శ్రీనివాస చక్రవర్తి 1970 ఏప్రిల్ 16న హైదరాబాద్ లో జన్మించారు. ఆయన తల్లి డాక్టర్ కోవెల శాంత. తండ్రి సూర్యనారాయణ రావు నాగులపాటి. సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ లో చదివారు చక్రి. సిబిఐటీలో బి.ఇ, పూర్తి చేశారు. చదువుతున్న రోజుల్లోనే చక్రవర్తి సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ ఆసక్తితోనే ‘శివ’లో బ్యాడ్ బోయ్ జె.దుర్గారావుగా నటించి ఆకట్టుకున్నారు. తరువాత కొన్ని సినిమాల్లో రాముడు మంచిబాలుడు అన్న పాత్రలనూ పోషించి అలరించారు. ఆరంభంలో జేడీ చక్రవర్తి తెరపై కనిపిస్తే చాలు అమ్మాయిలు రౌడీగాడు అనుకొనేవారు. ఈ రౌడీ అబ్బాయే తరువాతి రోజుల్లో ఎంతోమంది మగువల కలల రేడు కూడా అయ్యాడంటే ఆశ్చర్యం కలుగక మానదు. గురువు రామ్ గోపాల్ వర్మ బాటలోనే దర్శకుడు కావాలని ఆశించారు జేడీ. అతని దర్శకత్వంలో ‘ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ మహాత్మ’ను నిర్మించాలని ప్రయత్నించారు రామ్ గోపాల్ వర్మ. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చిరంజీవి కూడా “టీవీలో జేడీ చక్రవర్తి పాట వస్తోందంటే, అమ్మాయిలు పరుగులు తీసి మరీ చూడటం నేను చూశాను” అని చెప్పారు. దీనిని బట్టే, ఆ రోజుల్లో జేడీకి ఎంత క్రేజ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అయితే జేడీ దర్శకత్వంలో ఆరంభమైన ‘ఆటోబయోగ్రఫి ఆఫ్ మహాత్మ’ అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. అయితేనేమి ఓ వైపు నటనలో కొనసాగుతూనే, మరోవైపు దర్శకత్వంపై దృష్టి సారించారు జేడీ. ‘దుర్గ’ అనే చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో స్వీయ దర్శకత్వంలో రూపొందించి, నటించారు జేడీ. ఆ సినిమా ఆట్టే ఆకట్టుకోలేకపోయింది. తరువాత ‘దర్వాజ్ బంద్ రఖో’ అనే హిందీ చిత్రం తీసి ఫరవాలేదనిపించారు. ఆపై తెలుగులో “హోమం, సిద్ధం” చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాను హిందీలో తీసిన ‘దర్వాజ్ బంద్ రఖో’ చిత్రాన్నే తెలుగులో “మనీ మనీ మోర్ మనీ” అనే టైటిల్ తో రూపొందించారు. అదీ అంతే సంగతులు అనిపించింది. ‘వన్ బై టు, ఎగిరే పావురమా’ వంటి చిత్రాలలో శ్రీకాంత్ తో కలసి నటించారు జేడీ. వారిద్దరూ మంచి మిత్రులుగా సాగారు. తన మిత్రుడు శ్రీకాంత్ తో కలసి నటిస్తూ, ‘ఆల్ ద బెస్ట్’ అనే మూవీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. అది కూడా ఆకట్టుకోలేకపోయింది.
దర్శకత్వం చేయాలని ఆశించిన జేడీకి ఎందుకనో అది అంతగా కలసి రాలేదు. అయితే జేడీ చక్రవర్తి హీరోగా నటించిన ‘గులాబి’ చిత్రం ద్వారా కృష్ణవంశీ దర్శకునిగా పరిచయమయ్యారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. “అనగనగా ఒకరోజు, వన్ బై టూ, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా, నేను ప్రేమిస్తున్నాను, ప్రేమకు వేళాయెరా”వంటి చిత్రాలు జేడీ కి విజయాలను అందించాయి. ఇక గురువు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జేడీ నటించిన ‘సత్య’ చిత్రం అనూహ్య విజయం సాధించింది. ఇటు తెలుగులోనూ, అటు హిందీలోనూ ‘సత్య’తో జేడీ మంచి మార్కులు సంపాదించారు. అయితే ఆ తరువాత నుంచీ జేడీ చక్రవర్తి ప్రయోగాలకు శ్రీకారం చుట్టి, కమర్షియల్ హీరోగా సక్సెస్ కాలేకపోయారు. కానీ, అతను మాత్రమే న్యాయం చేయగలరు అన్న పాత్రలు ఇప్పటికీ అతణ్ణి వెదుక్కుంటూ వెళ్తున్నాయి. ఇక నిర్మాతగానూ జేడీ ప్రయోగాలే చేశారు. నిర్మాతగా తాను తీసిన తొలి చిత్రం ‘పాపే నా ప్రాణం’. ఈ చిత్రం ద్వారా తన మిత్రుడు బి.వి.రమణను దర్శకునిగా పరిచయం చేశారు. ఈ సినిమాను తొలుత టైటిల్ లేకుండా విడుదల చేశారు జేడీ. సినిమా చూసిన ప్రేక్షకుల అభిప్రాయం మేరకు ‘పాపే నా ప్రాణం’ అన్న టైటిల్ ను నిర్ణయించారు. అందుకే ఈ సినిమాను తొలుత ‘పేరులేని సినిమా’ అని జనం పిలిచారు. తరువాత తాను హీరోగా, దర్శకునిగా పనిచేస్తూ ‘దుర్గ’ నిర్మించారు జేడీ. అదీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఇలా నటునిగా, రచయితగా, నిర్మాతగా, దర్శకునిగా, గాయకునిగా జేడీ తనలోని ప్రజ్ఞను ప్రదర్శిస్తూ సాగారు. ఈ యేడాది జేడీ నటించిన ‘తాజా ఖబర్’అనే వెబ్ సిరీస్ వెలుగు చూసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ‘తాజా ఖబర్’లో జేడీ శెట్టి అన్నా అనే పాత్రలో కనిపించారు. తరువాత ఏ పాత్రలతో జేడీ చక్రవర్తి అలరిస్తారో చూడాలి.