Venu Thottempudi : They asked me to play the role of Sonusood in Athadu Movie!
‘స్వయంవరం’ మూవీతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వేణు ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాల్లో సోలో హీరోగా నటించాడు. అంతే కాదు… ‘చిరునవ్వుతో’ లాంటి సూపర్ హిట్ తర్వాత మల్టీస్టారర్ మూవీ ‘హనుమాన్ జంక్షన్’లోనూ నటించాడు. ప్రస్తుతం అతను రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీతో రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. విశేషం ఏమంటే… వేణు తొలిసారి తన పాత్రకు తానే ‘రామారావు ఆన్ డ్యూటీ’లో డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఇప్పటి వరకూ అతనికి వాయుపుత్ర నాగార్జున డబ్బింగ్ చెబుతూ వచ్చారు. బెటర్ లేట్ దాన్ నెవ్వర్ అన్నట్టుగా ఇప్పుడు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం ఆనందంగా ఉందని, ఇప్పుడీ పాత్రను తాను పూర్తిగా ఓన్ చేసుకోగలుగుతానని వేణు చెప్పారు.
తనకు గ్యాప్ రావడం గురించి వేణు చెబుతూ, ”మా ఫ్యామిలీ కొన్నేళ్ళుగా రోడ్ వర్క్స్, ఇరిగేషన్ రంగంలో ఉంది. దాంతో ఆ మధ్యలో ఫ్యామిలీ బిజినెస్ మీద దృష్టి పెట్టి నటనకు దూరమయ్యాను. అయితే కరోనా టైమ్ లో ఇంట్లోనే కూర్చోవడంతో వెబ్ సీరిస్ బాగా చూశాను. వాటిని చూసిన తర్వాత తిరిగి నటన మీదకు మనసు మళ్ళింది. దీనికి ముందు కొంత మంది తమ సినిమాల్లో నటించమని కోరినా సున్నితంగా తిరస్కరించాను. కరోనా తర్వాత ఎప్పుడైతే తిరిగి యాక్టింగ్ చేయాలనే కోరిక కలిగిందో… అప్పుడే చాయ్ బిస్కెట్ సంస్థ ఓ సినిమాలో కీ రోల్ ప్లే చేయమని నన్ను అడిగింది. మొదట పెద్దంత ఆసక్తి చూపించకపోయినా… అంతా కొత్తవారితో తీస్తున్న ఆ సినిమా కాన్సెప్ట్ నచ్చి ఓకే అన్నాను. ఆ తర్వాత వచ్చిన మరో ఛాన్స్ ఇదే! ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా కూడా మొదట అంగీకరించలేదు. బట్ దర్శకుడు శరత్ మండవ ఒక్కసారి లైన్ వినమని చెప్పిన తర్వాత నచ్చి ఓకే అన్నాను. గతంలో పోలీస్ డ్రస్ వేసుకుని కొన్ని సినిమాలు చేసిన ఈ తరహా జానర్ లో ఇలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదు. అది నాకు కొత్తగా అనిపించింది. పైగా రవితేజ మూవీతో రీ-ఎంట్రీ ఇస్తే… ఎక్కువమంది జనాలకు నేను తిరిగి నటిస్తున్నాననే విషయం తెలుస్తుందని అనిపించింది” అని అన్నారు. నిజానికి తనకు మల్టీస్టారర్ మూవీస్ చేయడం అంటే ఎంతో ఇష్టమని, అలానే ‘హనుమాన్ జంక్షన్’ మూవీని చేశానని, ఆ సినిమా షూటింగ్ అంతా సందడి సందడిగా జరుగుతుండేదని అన్నారు. ఇక అప్పట్లోనే త్రివిక్రమ్, మహేశ్ బాబుతో తీసిన ‘అతడు’ సినిమాలో సోనూసూద్ పాత్రను తనకు ఆఫర్ చేశారని వేణు చెప్పాడు. చిత్రం ఏమంటే… అందులో నాజర్ పోషించిన పాత్రకు మొదట్లో శోభన్ బాబును సంప్రదించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన సున్నితంగా తిరస్కరించడంతో నాజర్ కు ఆ ఛాన్స్ దక్కింది. అలానే వేణు తొట్టెంపూడి వద్దనుకోవడంతో సోనూసూద్ కెరీర్ లోనే మెమొరబుల్ పాత్ర అతని ఖాతాలో పడింది.
ఇక వేణు తొలి చిత్రం ‘స్వయంవరం’ నుండి త్రివిక్రమ్ తో అతనికి అనుబంధం ఉంది. అలానే చిత్రం రవితేజతోనూ వేణుకు పరోక్ష అనుబంధం ఉందనే అనుకోవాలి. ఎందుకంటే ‘స్వయంవరం’ కోసం మొదట సంగీత దర్శకుడిగా ఆర్.పి. పట్నాయక్ ను అనుకున్నారు. ఆ సినిమా కోసం కొన్ని ట్యూన్స్ కూడా అతనితో చేయించారు. అయితే అనుకోకుండా ‘స్వయంవరం’ ప్రాజెక్ట్ లోకి వందేమాతరం శ్రీనివాస్ వచ్చారు. దాంతో ఆర్.పి. పట్నాయక్ తాను చేసిన ట్యూన్స్ ను రవితేజ హీరోగా శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘నీ కోసం’ మూవీకి ఇచ్చారు. ఆ రకంగా సోలో హీరోలుగా ఇటు రవితేజ, అటు వేణు ఒకేసారి కెరీర్ ప్రారంభించినట్టు! ఇప్పుడు ఇంతకాలానికి రవితేజ మూవీలో వేణు కీ-రోల్ పోషించడం విశేషం.
అలానే ఆ మధ్యలో వేణు ‘దమ్ము’ సినిమాలో ఓ పాత్ర పోషించారు. ఆ సినిమాలో నటించిన అనుభవాన్ని చెబుతూ, సహజంగా క్యారెక్టర్ ఆర్టిస్టుకు కథ మొత్తాన్ని చెప్పారు. నా పాత్ర ఏమిటో దానినే చెబుతారు. రేపు రిలీజ్ కాబోతున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ విషయం కూడా అంతే. స్టోరీ లైన్, నా పాత్ర చెప్పారు. అవి నచ్చి ఈ మూవీ చేశారు. ఇక ‘దమ్ము’ విషయానికి వస్తే… ‘షోలే’లో అమితాబ్ బచ్చన్ పాత్ర లాంటిదని చెప్పారు. సంతోషించాను. అందులో అమితాబ్ చనిపోతాడు. ఇందులో నా పాత్ర కూడా చనిపోతుంది. అప్పుడప్పుడూ ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. అయితే అక్కడే ఆగిపోకుండా… జీవితంలో ముందుకు సాగిపోవాలి. ఇదో గేమ్ లాంటిది. రాబోయే రోజుల్లో వెబ్ సీరిస్ చేయడానికి కూడా నేను సిద్ధం” అని అన్నారు వేణు.