Vennela Kishore Chaari 111 Director Keerthi Kumar Interview: ‘మళ్ళీ మొదలైంది’తో దర్శకుడిగా పరిచయమైన టీజీ కీర్తి కుమార్ ‘చారి 111’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘వెన్నెల’ కిశోర్ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమాలో సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్ గా నటించారు. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మించిన ఈ సినిమా మార్చి 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.
‘చారి 111’ ఎలా మొదలైంది?
నేను దర్శకత్వం వహించిన ‘మళ్ళీ మొదలైంది’లో ‘వెన్నెల’ కిషోర్ కమెడియన్ రోల్ చేశారు. ఆ సినిమా చేసేటప్పుడు ‘చారి 111’ ఐడియా చెప్పాను. ఆయనతో చాలా రోజుల నుంచి ఇటువంటి సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఆయన స్క్రిప్ట్ సెండ్ చేయమని అడిగారు, నేరేషన్ ఇవ్వమనలేదు. స్క్రిప్ట్ చదివిన తర్వాత ఓకే చెప్పారు.
మీకు ఈ ఐడియా ఎప్పుడు వచ్చింది? ముందు ఎవరికి చెప్పారు?
‘చారి 111’కు ఇన్స్పిరేషన్ ‘పింక్ పాంథర్’, ‘జానీ ఇంగ్లీష్’ వంటి హాలీవుడ్ ఫిలిమ్స్. నాకు అటువంటి సినిమాలు ఇష్టం. నేను వెన్నెల కిశోర్ పాన్. ‘జానీ ఇంగ్లీష్’ ఫిల్మ్ చూసినప్పుడు నేను ఇండస్ట్రీలోకి ఎంటరైతే ఆయనతో అటువంటి సినిమా తప్పకుండా చేయాలని అనుకున్నాను. నా ఫస్ట్ సినిమాలో ఆయన కమెడియన్ రోల్ చేశారు. తర్వాత ఆయనతో సినిమా చేశా. ఇటువంటి సినిమాలకు కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన సినిమాలు చూస్తే లీడ్ యాక్టర్లను మైండ్ లో పెట్టుకుని సినిమాలు చేసినట్లు ఉంటాయి. కిశోర్, మురళీ శర్మని మనసులో పెట్టుకుని ఈ సినిమా స్క్రిప్ట్ రాశా. తర్వాత విలన్, కాన్‌ఫ్లిక్ట్ ఇష్యూ వచ్చాయి.
ఇంగ్లీష్ సినిమాల పేర్లు చెబుతున్నారు. తెలుగులో ఇన్స్పిరేషన్ ఏమీ లేదా?
తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారి ‘రుద్రనేత్ర’ ఉంది కదా! ఆ ఇన్స్పిరేషన్ తో మా సినిమాలో స్పై ఏజెన్సీకి ‘రుద్రనేత్ర’ అని పేరు పెట్టాను. ‘చంటబ్బాయ్’ సినిమా మర్చిపోకూడదు. అందులో చిరంజీవి డిటెక్టివ్. మా సినిమాలో హీరో స్పై రోల్.
సినిమాకి సీక్వెల్స్ చేయాలని అనుకుంటున్నట్లు తెలిసింది!
ట్రైలర్ చూస్తే… రుద్రనేత్ర స్పై ఏజెన్సీ ఉంటుంది. అందులో మరింత మంది హీరోలను తీసుకు రావాలని ఉంది, ‘చారి 111’కు కూడా సీక్వెల్ ప్లాన్ ఉంది. ఈ యూనివర్స్ లో ఏ సినిమా చేసినా స్పై యాక్షన్ కామెడీ జానర్ ఫిల్మ్ అవుతుంది అన్నారు.