వచ్చీ రాగానే ఆకట్టుకున్నవారు, తమ తొలి చిత్రాన్నే ఇంటి పేరుగా మార్చేసుకుంటూ ఉంటారు. అలా చిత్రసీమలో ఎందరో నటీనటులు అప్పట్లో వెలుగులు విరజిమ్మారు. ప్రస్తుతం అలా సాగుతున్న వారిలో ప్రముఖ హాస్యనటుడు ‘వెన్నెల’ కిశోర్ కూడా ఉన్నారు. తొలి చిత్రం ‘వెన్నెల’లోనే నటునిగా మంచి మార్కులు కొట్టేసిన కిశోర్ ఆ పై వెన్నెల కిశోర్ గా జనం మదిలో నిలిచారు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా తన హాస్యంతో నవ్వుల వెన్నెల కురిపిస్తూ సాగుతున్నారు కిశోర్. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో బిజీయెస్ట్ కమెడియన్ గా కిశోర్ తనదైన బాణీ పలికిస్తున్నారు.
వెన్నెల కిశోర్ 1977 సెప్టెంబర్ 19న కామారెడ్డిలో జన్మించారు. అక్కడే పాఠశాల విద్య సాగింది. తరువాత హైదరాబాద్ లో డిగ్రీ పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళారు కిశోర్. మిచిగాన్ లోని పెర్రిస్ స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేసిన కిశోర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కెరీర్ ఆరంభించారు. దర్శకుడు దేవా కట్టా తన తొలి చిత్రం ‘వెన్నెల’ రూపొందిస్తున్న రోజులవి. ఆ సినిమాలో చాలాభాగం అమెరికాలోనే చిత్రీకరించారు. అక్కడే కిశోర్ ను తన సినిమాలో ఖాదర్ బాషా పాత్ర కోసం ఎంచుకున్నారు దేవా కట్టా. ఆ చిత్రంతోనే కిశోర్ తన ఇంటిపేరును వెన్నెలగా మార్చుకున్నారు. ఆ తరువాత పలు చిత్రాలలో అలరించిన కిశోర్ కు మహేశ్ బాబు ‘దూకుడు’లో పోషించిన ఎమ్మెస్ శాస్త్రి పాత్ర మరింత పేరు సంపాదించి పెట్టింది. “రచ్చ, దరువు, జులాయి, దేనికైనా రెడీ, రన్ రాజా రన్, అల్లుడు శీను, సన్నాఫ్ సత్యమూర్తి, దువ్వాడ జగన్నాథం, గీతగోవిందం, చి.ల.సౌ, ఇంకోసారి, భలే భలే మగాడివోయ్, గూడచారి, మహర్షి, మత్తువదలరా, అల వైకుంఠపురములో, ఎంత మంచివాడవురా, భీష్మ, రంగ్ దే, జాతిరత్నాలు, సర్కారు వారి పాట, సీతారామమ్” వంటి చిత్రాలలో వైవిధ్యమైన పాత్రల్లో కనిపించి నవ్వులు పూయించారు కిశోర్. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులకు కితకితలు పెట్టడానికే ప్రయత్నిస్తున్నారు కిశోర్.
కేవలం నటుడిగానే కాకుండా “వెన్నెల 1 1/2, జఫ్ఫా” వంటి చిత్రాలకు దర్శకత్వం కూడా నెరిపారు కిశోర్. 2009లో ‘ఇంకోసారి’ చిత్రంతో ఉత్తమ హాస్యనటునిగా నంది అవార్డును అందుకున్నారు కిశోర్. ఆ తరువాత “భలే భలే మగాడివోయ్” చిత్రం ద్వారా మరోమారు ఉత్తమ హాస్యనటునిగా నంది అవార్డుకు ఎంపికయ్యారు. తనదైన పంథాలో పకపకలు పంచుతూ సాగుతున్న వెన్నెల కిశోర్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ మరింతగా జనాన్ని నవ్విస్తారని ఆశిద్దాం.