Veera Simha Reddy: నందమూరి నటసింహం బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా ‘వీరసింహారెడ్డి’. ఈ మూవీ తాజా షెడ్యూల్ బుధవారం నుండి ప్రారంభం కానుంది. గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రేపటి నుండి అనంతపురంలోని పెన్నా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఉరవకొండ, పెనుగొండ ఫోర్ట్ తదితర ప్రదేశాల్లో చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. 9వ తేదీ పెన్నోబిలంలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలోనూ, 10, 11 తేదీలలో ఆమిద్యాల, రాకెట్ల, ఉరవకొండలోనూ, 12,13 తేదీలలో పెనుగొండ ఫోర్ట్ లోనూ షూటింగ్ జరుగబోతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై భారీ ఎత్తున రూపొందుతున్న ‘వీరసింహారెడ్డి’లో బాలకృష్ణ సరసన తొలిసారి శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పలు బ్లాక్ బస్టర్ ఆల్బమ్ లను అందించిన సంగీత సంచలనం ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎ. ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా సేవలు అందిస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు. ఆస్ట్రేలియన్ ఇండియన్ యాక్ట్రస్ చంద్రిక రవి ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నర్తిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కు, టైటిల్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిందని, మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నామని నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ తెలిపారు.