Veera Simha Reddy: అరె… ఇది కదా పోటీ అంటే! ఇప్పుడు కదా… మజా వచ్చేది! మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ నుండి “బాస్ పార్టీ…” అనే సాంగ్ నవంబర్ 23న విడుదలయింది. అదే రోజున ‘వీరసింహారెడ్డి’గా వస్తోన్న నటసింహ బాలకృష్ణ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను నవంబర్ 25న ఉదయం 10 గంటల 29 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. అందువల్ల సినీ ఫ్యాన్స్‌లో ఈ రెండు చిత్రాలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ‘వీరసింహారెడ్డి’ ఫస్ట్ సింగిల్ నవంబర్ 25న వస్తోందని తెలియగానే.. బాలయ్య ఫ్యాన్స్‌లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ‘వీరసింహారెడ్డి’గా బాలకృష్ణ గెటప్ ఇప్పటికే అభిమానులను ఆకట్టుకుంది. ఎప్పుడెప్పుడు తెరపై బాలయ్యను ‘వీరసింహారెడ్డి’గా చూద్దామా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. వారి ఉత్సాహాన్ని మరింత పెంచేందుకు అన్నట్టుగా ఈ సినిమాలోని “రాజసం నీ ఇంటి పేరు…” అంటూ సాగే పాటను ఫస్ట్ సింగిల్‌గా విడుదల చేస్తున్నారు. పోస్టర్‌లో బాలయ్య వైట్ అండ్ వైట్ వేసుకొని ట్రాక్టర్ నడుపుతూ కనిపిస్తున్నారు. మరి ఫస్ట్ సింగిల్‌లో ఈ లుక్ మరింతగా ఆకర్షిస్తుందని అనిపిస్తోంది.
బాలయ్యను చూడగానే అభిమానులు “జై బాలయ్యా…” అంటూ కేరింతలు కొడతారు. అందుకు తగ్గట్టుగానే మొన్న ‘అఖండ’లో “జై జై జైబాలయ్యా…” సాంగ్ రూపొంది, ఫ్యాన్స్‌ను ఎంతగానో అలరించింది. ‘వీరసింహారెడ్డి’లోనూ మరోమారు ‘జై బాలయ్యా…’ అంటూ సాగే మరో మాస్ నంబర్‌ను థమన్ స్వరపరచినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని సంక్రాంతి సంబరాల్లో నిలుపుతున్నామని ప్రకటిస్తున్నారే కానీ, తేదీ ఏమిటో నిర్మాతలు ఇంకా చెప్పడం లేదు. ఏది ఏమైనా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నుండి ఇద్దరు టాప్ స్టార్స్‌తో సంక్రాంతికి సినిమాలు వస్తున్నాయి. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లోని “బాస్ పార్టీ…” సాంగ్ ఆయన ఫ్యాన్స్ సందడితో భలేగా దూసుకుపోయింది. అదే తీరున బాలయ్య అభిమానుల ఆదరణతో “రాజసం నీ ఇంటిపేరు…” పాట కూడా మురిపిస్తుందని సినీజనం భావిస్తున్నారు.