నాగశౌర్య, రీతూవర్మ తొలిసారి జంటగా నటించిన సినిమా ‘వరుడు కావలెను’. గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ కు ముందు వచ్చిన నాగశౌర్య ‘అశ్వద్థామ’ చిత్రం కమర్షియల్ గా ఆశించిన స్థాయి విజయాన్ని పొందలేకపోయింది. అదే యేడాది రీతూవర్మ హీరోయిన్ గా నటించిన ‘కనులు కనులను దోచాయంటే’ మూవీకి హిట్ టాక్ వచ్చినా, కలెక్షన్లపై కరోనా దెబ్బ పడింది. ఈ యేడాది రీతూవర్మ నటించిన ‘నిన్నిలా – నిన్నిలా’, ‘టక్ జగదీశ్’ చిత్రాలు ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయ్యాయి. పైగా చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. ఇక ఈ మార్చిలో నాగవంశీ నిర్మించిన ‘రంగ్ దే’ చిత్రం కమర్షియల్ గా పెద్దంత పే చేయలేదు. అలానే పుష్కరకాలంగా దర్శకత్వ శాఖలో ఉన్న లక్ష్మీ సౌజన్యకు ‘వరుడు కావలెను’ డెబ్యూ మూవీ. సో…. వీరందరికీ ఇదో లిట్మస్ టెస్ట్ లాంటిది. మరీ ఈ సినిమా వీరి ఆశలను నిలబెట్టిందా? ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయ్యిందా!? చూద్దాం.
పారిస్ లో ఫేమస్ ఆర్కిటెక్చర్ గా ఉండే ఆకాశ్ (నాగశౌర్య) కు ఉన్నట్టుండి ఇండియా మీద ప్రేమ పుట్టుకొస్తుంది. కోట్ల డీల్ ను కాదనుకుని ఇక్కడకు వచ్చేస్తాడు. తన స్నేహితుడి తండ్రి సాయంతో ధరణి ఎకో ఫెండ్లీ కంపెనీతో చేతులు కలుపుతాడు. ఆ స్టార్టప్ కంపెనీని నిర్వహించేది అతని ఒకప్పటి కాలేజ్ మేట్ భూమిక (రీతూవర్మ). ఆరేడేళ్ళ క్రితం పరిచయం ఉన్న ఆమెతో అప్పుడు ప్రేమలో పడని ఆకాశ్ ఇప్పుడు పడతాడు! పెళ్ళీడు వచ్చినా ఎవరితోనూ కనెక్ట్ కాలేని భూమి…. ఆకాశ్ తో కనెక్ట్ అయ్యిందా? భూమి పెళ్ళి చేయడమే జీవిత ధ్యేయంగా పెట్టుకున్న ఆమె తల్లి కోరిక తీరిందా? అనేది మిగతా కథ.
నిజానికి ఈ కథలో కొత్తదనం ఏమీ లేదు. ఇదో మెచ్యూర్డ్ లవ్ స్టోరీ. బట్ దర్శకురాలు లక్ష్మీ సౌజన్యకు ఇది మొదటి సినిమానే అయినా ఫ్లాష్ బ్యాక్ స్టోరీని సైతం చక్కగా రివీల్ చేసి, సాఫీగా మూవీ సాగిపోయేలా చేశారు. ఇందులో ఊహించని ట్విస్టులేవీ లేవు, క్లయిమాక్స్ లో వచ్చే ఒకటి రెండు తప్ప! కానీ సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ కూల్ గా వెళ్ళిపోయింది. పైకి ఇదో ఇగోయిస్టిక్ లేడీ లవ్ స్టోరీలా కనిపించినా, పెళ్ళికాని అమ్మాయిల మనసుల్ని, వారి అమ్మల మానసిక పరిస్థితిని దర్శకురాలు తెర మీద ఆసక్తికరంగా చూపించారు. సినిమా ప్రథమార్ధం భూమిక కథలా అనిపించినా, ద్వితీయార్థంకు వచ్చేసరికీ ఆకాశ్ ప్రధానంగా సాగుతుంది. మొత్తంగా ఓ అబ్బాయి, ఓ అమ్మాయి తమ మనసులోని ప్రేమను సరైన సమయంలో వ్యక్తం చేయకపోవడం వల్ల జరిగే పరిణామాలే ఈ సినిమా! ఓ చిన్న పాయింట్ ను తీసుకుని, రెండు గంటల చిత్రంగా మలచడం కాస్తంత కష్టమే. ప్రథమార్ధంలో ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది, కానీ ద్వితీయార్థంకు వచ్చే సరికీ కాస్తంత ‘లాగ్’ అనిపిస్తుంది. దాన్ని కవర్ చేయడానికి లాగ్ కామెడీ పెట్టారు. హీరోకి సంబంధించిన అసలు ట్విస్ట్ ను మూవీ చివరిలో రివీల్ చేసి, ఠక్కున ముగించేసినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ విషయంలో ఇంకాస్తంత కేర్ తీసుకుని ఉండాల్సింది.
ఆర్టిస్టుల విషయానికి వస్తే నాగశౌర్య, రీతూవర్మ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టే ఉన్నారు. రీతూవర్మలో చక్కని గ్రేస్ ఉంది. చీరకట్టులో తెర మీద చాలా అందంగా కనిపించింది. పాటల కంపోజిషన్ సైతం ఆమె బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకునే చేశారనిపిస్తోంది. కాలేజీ కల్చరల్ ఈవెంట్ లో వచ్చే ‘దిగు దిగు దిగు నాగ’ మాత్రమే అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్నట్టుగా ఉంది. బట్ యూత్ కు ఆ పాట బాగా ఎక్కేసింది. ఆకాశ్ పాత్రలో నాగశౌర్య చక్కగా ఇమిడిపోయాడు. హీరోయిన్ తల్లితండ్రులుగా నదియా, మురళీశర్మ అదరగొట్టారు. నదియా తన సహజనటనతో ఆకట్టుకుంటే, మురళీశర్మ పాత్ర ఔచిత్యం కారణంగా ఎక్కువ మార్కులు పడతాయి. హీరో స్నేహితుడిగా ప్రవీణ్, హీరోయిన్ ఆఫీస్ స్టాఫ్ గా ‘వెన్నెల’ కిశోర్, హిమజా, ఆమె వెల్ విషర్, కమ్ మెంటర్ గా జయప్రకాశ్ అంతా చక్కగా నటించారు. హీరో తల్లిగా రోహిణి ఒకే సీన్ కు పరిమితం కావడం బాలేదు. కనిపించేది రెండు సీన్లే అయినా హర్షవర్థన్ కాస్తంత విలనీని, కాస్తంత కామెడీని బాగానే పండించాడు. ఇక మిగిలిన పాత్రల్లో ఆనంద్, కిరిటీ దామరాజు, సప్తగిరి, దేత్తడి హారిక తదితరులు కనిపిస్తారు.
సాంకేతిక నిపుణులలో చెప్పుకోవాల్సింది ప్రధానంగా సినిమాటోగ్రఫర్ పచ్చిపులుసు వంశీ, మాటల రచయిత గణేశ్ రావూరి గురించి! కామెడీ బాగా పండటానికి తగ్గ పంచ్ డైలాగ్స్ తో పాటు క్యారెక్టర్స్ ఎలివేట్ అయ్యేలా చక్కని సంభాషణలతో గణేశ్ తన కలం బలాన్ని చూపించాడు. తెర మీద కనిపించే చాలా పాత్రలకు ప్రారంభం, ముగింపు అంత పర్ఫెక్ట్ గా లేదు. బహుశా ఎడిటర్ నవీన్ నూలి రన్ టైమ్ ను కంట్రోల్ చేసే క్రమంలో చాలానే ట్రిమ్ చేశాడనిపిస్తోంది. సంగీతం విషయానికి వస్తే, తమన్ స్వరపరిచిన ‘దిగు దిగు దిగు నాగ’ పాటతో పాటు విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన మిగిలిన పాటలూ, వాటి సాహిత్యం కూడా బాగున్నాయి. మరీ ముఖ్యంగా నేపథ్య సంగీతం సూపర్! ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఓ బెస్ట్ టీమ్ గా ఏర్పడి, మామూలు కథను, బోర్ కొట్టకుండా చక్కని స్క్రీన్ ప్లేతో తెర మీద ఆసక్తి కరంగా చూపించారు. యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ పెట్టిన ఖర్చు సైతం తెర మీద కనిపిస్తోంది. మొత్తం మీద థియేటర్ నుండి బయటకు వచ్చే ప్రేక్షకుడికి ఓ చక్కని అనుభూతిని ‘వరుడు కావలెను’ మూవీ అందిస్తుంది.
ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
సాంకేతిక నిపుణుల పనితనం
ఆకట్టుకునే వినోదం
మైనస్ పాయింట్స్
సెకండ్ హాఫ్ లోని లాగ్..!
పెద్దగా ట్విస్ట్స్ లేకపోవడం..
రేటింగ్: 3/5
ట్యాగ్ లైన్: కూల్ బ్రీజ్!