రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మార్షల్ ఆర్ట్ మూవీ ‘లడకీ’ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. యాక్షన్ తో పాటు కుర్రకారుని ఆకట్టుకునే మసాలా సన్నివేశాలకూ వర్మ ఈ ట్రైలర్ లో చోటిచ్చాడు. ఈ ట్రైలర్ విడుదల కాగానే అమితాబ్ బచ్చన్ మొదలుకొని పలువురు సినీ ప్రముఖులు వర్మకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ట్ సి మీడియా, చైనా కు చెందిన బిగ్ పీపుల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. దాంతో ఈ సినిమాను హిందీలో పాటు చైనీస్ భాషలోనూ విడుదల చేయబోతున్నారు. ఆ దేశంలో ఈ సినిమా ‘డ్రాగన్ గర్ల్’ పేరుతో విడుదల కానుంది. ఈ మూవీ మార్షల్ ఆర్ట్స్ రారాజు బ్రూస్ లీ నటించిన ‘ఎంటర్ ది డ్రాగన్’కు తాను ఇస్తున్న నివాళి అని వర్మ చెబుతున్నాడు.
బ్రూస్ లీ 81వ జయంతి సందర్భంగా దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా లో ఈ 27వ తేదీ ‘లడకీ’ (ది డ్రాగన్ గర్ల్) మొదటి పోస్టర్ ను విడుదల చేయబోతున్నారు. అలాగే చైనా లోని ఫోషన్ కుంగ్ ఫు ఫిలిం ఫెస్టివల్ లో బ్రూస్ లీ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రీమియర్ చేస్తున్నారు. భారతదేశంలోనే మొదటి మార్షల్ ఆర్ట్స్ మూవీగా వర్మ చెబుతున్న ‘లడకీ’లో టైటిల్ రోల్ ను మార్షల్ ఆర్ట్స్ నిపుణురాలు పూజా భలేకర్ పోషించింది. డిసెంబర్ 10వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని చైనా లోని భారీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ చైనా ఫిలిం గ్రూప్ కార్పొరేషన్ భారీ ప్రమోషన్ తో 20 వేల థియేటర్స్ లో విడుదల చేయబోతోందని వర్మ తెలిపారు.