మెగా ఫ్యామిలీ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ కు వరుసగా రెండో దెబ్బ తగిలింది. తొలి చిత్రం ‘ఉప్పెన’తో ఉవ్వెత్తున ఎగిసిన వైష్ణవ్ తేజ్ కెరీర్ వేవ్… రెండో సినిమా ‘కొండపొలం’తో టప్పున పడిపోయింది. ‘ఉప్పెన’లో ఉన్న ఫ్యామిలీ డ్రామా, కాస్ట్ కాన్ ఫ్లిక్ట్ ‘కొండపొలం’లో లేకపోవడం, అది వ్యక్తిత్వ వికాస పుస్తకాన్ని తలపించడంతో ఆడియెన్స్ కనెక్ట్ కాలేదు. దాంతో ఇలా కాదని తన రూట్ ను మార్చాడు వైష్ణవ్ తేజ్. ఈసారి పక్కా కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదే ‘రంగ రంగ వైభవంగా’! విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ డైరెక్టర్ అయిన గిరీశాయతో ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. హీరోయిన్ గా కేతిక శర్మ నటించింది. వినాయక చవితి కానుకగా శుక్రవారం జనం ముందుకు వచ్చిన ‘రంగ రంగ వైభవంగా’ సినిమా కథ పరమ రొటీన్ గా ఉండటంతో ప్రేక్షకులు తిరస్కరించారు. దాంతో వైష్ణవ్ తేజ్ ఖాతాలో వరుసగా రెండో ఫ్లాప్ జమ అయ్యింది.

ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్ఛ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లో ఓ మూవీ చేస్తున్నాడు. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ‘పెళ్ళిసందడి’ ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరక్టర్ గా పరిచయం అవుతున్నాడు. సంక్రాంతి కానుకగా దీన్ని వచ్చే యేడాది జనవరికి విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు. అయితే అదే సమయంలో చిరంజీవి, ప్రభాస్, విజయ్ వంటి బిగ్ స్టార్ హీరోల మూవీస్ ఉంటే మాత్రం ఇది కాస్తంత అటూ, ఇటూ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఏదేమైనా… కథల ఎంపికలో సరైన నిర్ణయం తీసుకోకపోతున్నాడనే విమర్శ వైష్ణవ్ తేజ్ కు వచ్చేసింది. మరి సితార ఎంటర్ టైన్ మెంట్ మూవీతో అయినా వైష్ణవ్ తేజ్ విజయాన్ని అందుకుంటే మంచిదే! లేదంటే… ఇలా పరాజయాలతో తెలుగు సినిమా రంగంలో ఇవాళ్టి పరిస్థితుల్లో ఎక్కువ కాలం రాణించడం కష్టమే!