తెలుగు సినిమా స్వర్ణయుగానికి మెరుగులు దిద్దిన మహోన్నతులైన దర్శకుల్లో వీరమాచినేని మధుసూదనరావు అలియాస్ విక్టరీ మధసూదనరావు ఒకరు. ఆత్మబలం, గుడిగంటలు, కల్యాణమంటపం, లక్షాధికారి, భక్తతుకారం, పదండి ముందుకు, ఆరాధన, మనుషులు మారాలి, మల్లెపూవు, చక్రవాకం, వీరాభిమన్యు, రక్తసంబంధం, విక్రమ్, సామ్రాట్… ఇలా దాదాపు 71 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువ శాతం విజయాలను స్వంతం చేసుకుని విక్టరీని ఇంటిపేరుగా మార్చుకున్న ప్రతిభాశాలి వి మధుసూదనరావు. 1923 జూన్ 14న జన్మించిన ఆయన ఈ ఏడాది వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శతజయంతి వేడుకలను అయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదనరావు శిష్యులు, అభిమానులు, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
ముఖ్యఅతిథిగా హాజరుకాలేక పోయిన మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు మధుసూదనరావు చిత్రపరిశ్రమకు చేసిన సేవను లేఖ ద్వారా కొనియాడారు. ఈ సందర్భంగా మధుసూదనరావు గారి కుమార్తె వాణి మాట్లాడుతూ… ‘మధుసూదనరావు గారి అమ్మాయి అనే గొప్ప గుర్తింపు ఇచ్చిన నాన్నగారి రుణం ఎలా తీర్చుకోగలను. ఆయన సినిమానే శ్వాసించారు. సినిమానే జీవితంగా భావించి పయనించారు. నాన్నగారి శతజయంతి వేడుకలకు విచ్చేసి ఆయనకు నివాళులు అర్పించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను’ అన్నారు.
Untitled Design (1)
నటుడు, నిర్మాత మురళీమోహన్ మాట్లాడుతూ… ‘మధుసూదనరావు గారి దర్శకత్వంలో నటించడం నా అదృష్టం. ఆయన చాలా కోపిష్టి. ఎంత కోపిష్టో అంత మంచి మనసు కలవారు. నటన విషయంలో ఆయన్ను ఒప్పించడం అంత తేలిక కాదు. నాకు జేబుదొంగ సినిమాలో సెకండ్ హీరో అవకాశం ఇచ్చారు. మొదట చాలా భయపడ్డాను. ఆ తర్వాత ఆయన మెప్పు పొందాను. హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన అగ్ర దర్శకుల్లో ఆయనే మొదటి వారు. లోకల్ టాలెంట్‌ను ప్రోత్సహించటానికి ‘మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్’ను స్థాపించి ఎందరో కళాకారులను పరిశ్రమకు అందించారు. ఆయన శత జయంతి వేడుకల వేదిక మీద మాట్లాడే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నా’ అన్నారు.
దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ… ‘ఈరోజు మూడు పూటలా అన్నం తింటున్నాను అంటే అది మధుసూదనరావు గారి దయే. నా చేతి రాత చూసి, నా తలరాత మార్చేశారు అయన. పి చంద్రశేఖర్‌రెడ్డి గారి ద్వారా ఆయన్ను కలవడం జరిగింది. మొదట ఆయన ఆగ్రహానికి గురైనా.. ఆ తర్వాత ఆయన ప్రేమను అమితంగా పొందిన వాడిని. అలాంటి మహానుభావుడి శతజయంతి వేడుకలు నిర్వహించుకోవడం ద్వారా భావితరాలకు ఆయన గొప్పతనాన్ని చాటిచెప్పడం చాలా సంతోషం’ అన్నారు.
Untitled Design (2)
దర్శకులు బి. గోపాల్ మాట్లాడుతూ… ‘ఆయన దగ్గర పనిచేయక పోయినా ఆయన సినిమాలు చూసి చాలా నేర్చుకున్నాను. తెలుగు సినిమా ఉన్నంత కాలం గుర్తుంచుకోదగ్గ పేర్లలో మధుసూదనరావు గారి పేరు కూడా ఉంటుంది. తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఇలాంటి పెద్దలను శతజయంతి పేరుతో మరోసారి గుర్తు చేసుకోవడం మన అదృష్టం’ అన్నారు. ఎస్.వి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ… ‘మధుసూదనరావు గారి సినిమాలు అన్నీ నేను చూశాను. ఆయన సినిమాల్లో సెంటిమెంట్, మానవతా విలువలు, సమాజం పట్ల బాధ్యత కనిపిస్తాయి. ఆయన స్ఫూర్తితో నేను మావిచిగురు, శుభలగ్నం వంటి బంధాలు, అనుబంధాలకు విలువనిచ్చే సినిమాలు తీశాను. ఈ శత జయంతి సందర్భంగా ఆయను గుర్తుచేసుకుని శతజయంతి వేడుకల్లో పాల్గొన్నందుకు గర్వంగా ఉంది’ అని చెప్పారు.
రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ… ‘మధుసూదనరావు గారు కమ్యునిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇన్ని కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించి సూపర్ హిట్‌లు ఇచ్చారంటే నమ్మశక్యం కాని విషయం. అలాంటి మహానుభావుని శత జయంతి వేడుకుల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా’ అని తెలిపారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ… ‘నాన్నగారికి, మధుసూదనరావు గారికి ఎంతో స్నేహం ఉండేది. సినిమాకు సంబంధించిన ఎ టు జెడ్ తెలిసిన వ్యక్తి మధుసూదనరావు గారు. ఓ వైపు కుటుంబ కథా చిత్రాలను తీస్తూనే.. మరోవైపు సమాజాన్ని మేల్కొలిపే అభ్యుదయ చిత్రాలను కూడా తీసి విజయం సాధించారు. ప్రజలను చైతన్య వంతులను చేయడానికి సినిమా అనే మాధ్యమాన్ని మాగ్జిమమ్ ఉపయోగించుకున్న దర్శకుల్లో మధు గారు ముందు వరుసలో ఉంటారు. ఆయన భౌతికంగా దూరమైనా ఆయన సినిమాల ద్వారా చిరంజీవిగా ఉంటారు’ అని అన్నారు. ఈ వేడుకలో పాల్గొన్న సినీ ప్రముఖులను మధుసూదనరావు కుటుంబ సభ్యులు శాలువాలు, మెమొంటోలతో సత్కరించారు.
Untitled Design (3)