V. Madhusudhan Rao : విక్టరీ’ని ఇంటి పేరుగా మార్చుకున్న మధుసూదనరావు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలో యాభైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి దర్శకుడిగా చరిత్ర సృష్టించారు వి.మధుసూదనరావు. ఆయన పూర్తి పేరు వీరమాచినేని మధుసూదనరావు అయినా, అందరూ ‘విక్టరీ’ మధుసూదనరావు అనే పిలిచేవారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన పలు చిత్రాలు విజయకేతనం ఎగురవేయడంతో ‘విక్టరీ’ ఇంటిపేరుగా మారింది. ఇక ‘రీమేక్ కింగ్’ గానూ ఆయన అలరించారు. మధుసూదనరావు దర్శకత్వంలో రూపొందిన పలు రీమేక్ మూవీస్ తెలుగువారిని విశేషంగా ఆకట్టుకున్నాయి.
మధుసూదనరావు 1923 జూన్ 14న కృష్ణాజిల్లాలో జన్మించారు. చదువుకొనే రోజుల నుంచీ కళల పట్ల అభిలాష ఉండేది. నాటకాలు వేసేవారు. తొలి నుంచీ అభ్యుదయభావాలు మనసులో నింపుకున్న మధుసూదనరావు ఛాందసభావాలను నిరసిస్తూ ఉండేవారు. స్వాతంత్ర్య పోరాటంలోనూ పాల్గొని జైలుకు వెళ్ళి వచ్చారు. మద్రాసు చేరిన తరువాత చిత్రసీమవైపు అడుగులు వేశారు. చదువుకొనే రోజుల్లో ఆడిన అభ్యుదయ నాటక అనుభవం అక్కడ పనిచేసింది. కమ్యూనిస్ట్ భావాలున్న మధుసూదనరావుకు విచిత్రంగా ‘సతీ తులసి’ పౌరాణికం రూపొందించే అవకాశం లభించింది. ఆ సినిమా అంతగా అలరించలేకపోయింది. అదే సమయంలో సినిమాల్లో నటించాలని మదరాసు చేరిన వి.బి.రాజేంద్రప్రసాద్ మనసు మార్చుకొని నిర్మాతగా మారారు. రాజేంద్ర ప్రసాద్ ‘జగపతి’ సంస్థ నెలకొల్పి మొట్టమొదటి సినిమాగా ‘అన్నపూర్ణ’ను నిర్మిస్తూ మధుసూదనరావును దర్శకునిగా ఎంచుకున్నారు. జగ్గయ్య, జమున జంటగా నటించిన ఆ సినిమా మంచి ఆదరణ చూరగొంది. తరువాత మధుసూదనరావు దర్శకత్వంలోనే రాజేంద్రప్రసాద్ వరుసగా “ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతులు” చిత్రాలను నిర్మించి, జనాన్ని ఆకట్టుకున్నారు. మరోవైపు మధుసూదనరావు ఇతర నిర్మాతలతోనూ విజయపథంలో పయనించారు.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
మధుసూదనరావు తొలి చిత్రం ‘సతీ తులసి’ పరాజయం పాలయినప్పుడు అందరూ కమ్యూనిస్ట్ కు పౌరాణికం అప్పగిస్తే ఇట్టాగే ఉంటుందని గేలి చేశారు. అయితే తప్పకుండా పౌరాణికంతో విజయం సాధించాలని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని తన ‘రక్తసంబంధం’ నిర్మాతలు సుందర్ లాల్ నహతా, డూండీకి చెప్పారు. వారు కూడా ఆయనకు సహకారం అందించారు. తత్ఫలితంగా రూపొందిన చిత్రమే ‘వీరాభిమన్యు’. ఈ పౌరాణిక చిత్రం ఘనవిజయం సాధించింది. ఇందులో అభిమన్యునిగా నటించిన శోభన్ బాబుకు మంచి పేరు లభించింది. శోభన్ బాబు స్టార్ డమ్ చేరుకోవడానికి దాదాపు పుష్కరకాలం పట్టింది. ఆ సమయంలో మధుసూదనరావు చిత్రాలే శోభన్ కు అండగా నిలిచాయి. అలా ‘వీరాభిమన్యు’తో సక్సెస్ చూసిన మధుసూదనరావు పట్టుదలను అందరూ అభినందించారు.
మధుసూదనరావుకు ‘రీమేక్ కింగ్’ అని పేరు ఉంది. అలా ఆయన దరికి చేరిన తొలి రీమేక్ ‘రక్తసంబంధం’. తమిళంలో విజయం సాధించిన ‘పాశమలర్’ ఆధారంగా తెరకెక్కిందీ చిత్రం. ఇందులో యన్టీఆర్, సావిత్రి అన్నాచెల్లెళ్ళుగా నటించి మెప్పించారు. 1962లో రూపొందిన ‘రక్తసంబంధం’ను తెలుగు వాతావరణానికి అనువుగా రూపొందించారు మధుసూదనరావు. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. నిజం చెప్పాలంటే మధుసూదనరావుకు తొలి ఘనవిజయం ఇదే! బెంగాలీ మూవీ ‘సాగరిక’ ఆధారంగా ‘ఆరాధన’, మరో బెంగాలీ చిత్రం ‘అగ్నిసంస్కార్’ రీమేక్ గా ‘ఆత్మబలం’, తమిళ ‘ఆలయమణి’ ఆధారంగా ‘గుడిగంటలు’, మళయాళ ‘తులాభారం’ రీమేక్ గా ‘మనుషులు మారాలి’, కన్నడ ‘గజ్జెపూజ’ తో ‘కళ్యాణమండపం’, తమిళ ‘సవాలే సమాలి’ ద్వారా ‘మంచిరోజులు వచ్చాయి’, కన్నడ ‘శరపంజర’ ఆధారంగా ‘కృష్ణవేణి’ , ‘దో యార్’ రీమేక్ గా ‘ఇద్దరూ ఇద్దరే’, ‘అమానుష్’ ద్వారా ‘ఎదురీత’, ‘ప్యాసా’ ఆధారంగా ‘మల్లెపువ్వు’, కన్నడ ‘తాయిగె తక్క మగ’తో ‘పులిబిడ్డ’ వంటి చిత్రాలను తీసి ‘రీమేక్ కింగ్’గా పేరు సంపాదించారు మధుసూదనరావు.
మహానటులు యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరి చిత్రాల ద్వారా ఆయనకు ‘విక్టరీ’ ఇంటిపేరుగా మారింది. యన్టీఆర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘లక్షాధికారి’ని కూడా సక్సెస్ రూటులో సాగేలా చేశారు మధుసూదనరావు. ఈ ‘లక్షాధికారి’తోనే తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మాతగా మారడం విశేషం. ఏయన్నార్ నాయకునిగా రూపొందిన ‘భక్త తుకారాం’ కూడా మంచి విజయం సాధించింది. ఏయన్నార్ తో జగపతి బ్యానర్ లో రూపొందించిన చిత్రాలు కాకుండా, “జమీందార్, మంచికుటుంబం, ఆత్మీయులు, పవిత్రబంధం, మంచివాడు” వంటి విజయవంతమైన చిత్రాలు రూపొందించారు మధుసూదనరావు. ఇక యన్టీఆర్ తో “ఎదురీత, సూపర్ మేన్” వంటి చిత్రాలనూ తెరకెక్కించి ఆకట్టుకున్నారు. సూపర్ హీరో స్టోరీతో రూపొందిన ‘సూపర్ మేన్’గా యన్టీఆర్ ను జనం ముందు నిలిపిందీ ఆయనే! ‘ఆత్మీయులు, ప్రేమలు-పెళ్ళిళ్ళు, చక్రవాకం, చండీప్రియ’ వంటి నవలా చిత్రాలు మధుసూదనరావు దర్శకత్వంలో రూపొందాయి. వీటిలో ‘ఆత్మీయులు’ మంచి విజయం సాధించింది. శోభన్ బాబు తో తీసిన ‘జేబుదొంగ, జూదగాడు’ కూడా ఆకట్టుకున్నాయి. కృష్ణంరాజుతో రూపొందించిన ‘బెబ్బులి’ మంచి ఆదరణ పొందింది. మధుసూదనరావు దర్శకత్వంలో కన్నడ, హిందీ చిత్రాలు కూడా రూపొందాయి.
మధుసూదనరావు హైదరాబాద్ చేరి, తెలుగువారిలోని ప్రతిభను వెలికి తీసేందుకు ‘మధు ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్’ నెలకొల్పారు. ఈ ఇన్ స్టిట్యూట్ ద్వారా శివాజీరాజా, శ్రీకాంత్, సూర్య వంటివారు వెలుగు చూశారు. వారు చిత్రసీమలో ఇప్పటికీ రాణిస్తున్నారు. మధుసూదనరావుకు అసోసియేట్స్ గా పనిచేసిన కె.రాఘవేంద్రరావు, ఏ.కోదండరామిరెడ్డి, పి.చంద్రశేఖర్ రెడ్డి, మోహన్ గాంధీ వంటివారు తరువాతి రోజుల్లో దర్శకులుగా జయకేతనం ఎగురవేశారు. దాదాపు 70 చిత్రాలకు దర్శకత్వం వహించారు మధుసూదనరావు. 1997లో మధుసూదనరావుకు శిష్యులందరూ ఘనంగా సన్మానం చేశారు. ఆ నాటి ఆ సభలో దాసరి, రాఘవేంద్రరావు తదితరులు ఆయనను సన్మానించిన తీరును ఇప్పటికీ ఘనంగా చెప్పుకుంటారు. ఏది ఏమైనా ‘విక్టరీ’ మధుసూదనరావుగా జనం మదిలో నిలిచపోయారాయన.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!