Urvashi Rautela Trolled For Making Reel With Pak Cricketer Naseem Shah: కొన్ని కొన్ని సార్లు కొందరు సెలెబ్రిటీలు సమయం, సందర్భం లేకుండా విచిత్రమైన పోకడలు పోతుంటారు. అవి చూసేందుకు జుగుస్పాకరంగానూ, ఆగ్రహానికి గురి చేసేలాగానూ ఉంటాయి. అప్పుడు నెటిజన్లు ఊరికే ఉంటారా.. సోషల్ మీడియాలో ఒకటే ట్రోల్ చేసిపారేస్తారు. విమర్శలు ఎక్కుపెడుతారు. ఇప్పుడు ఊర్వశీ రౌతేలా చేసిన పనికి.. ఆమెపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌ను వీక్షించేందుకు ఊర్వశీ రౌతేలా మైదానానికి హాజరైంది. అయితే.. ఓ సందర్భంలో పాకిస్తాన్ క్రికెటర్ నసీమ్ షాతో అనుకోకుండా ఐ కాంటాక్ట్ కుదిరింది. ఆ దృశ్యాలను కెమెరామ్యాన్ రికార్డ్ చేశాడు. ఇదేదో బాగుందే.. అని అనుకొని, దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చేసి షేర్ చేసింది. అంతే, అది చూసిన నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అసలే మ్యాచ్ ఓడిపోయిన బాధలో ఉంటే, నువ్వు ప్రత్యర్థి క్రికెటర్‌తో రీల్ చేస్తావా? నీకు పాక్ క్రికెటరే దొరికాడా? అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. ఆ విమర్శల దాడి తట్టుకోలేక.. ఊర్వశీ కాసేపట్లోనే ఆ రీల్‌ని తొలగించింది. అయినా ఏం లాభం, అప్పటికే జరగాల్సిన నష్టమైతే జరిగిపోయిందిగా!
ఈ ఘటనకు కొన్ని రోజుల ముందుకు కూడా.. రిషభ్ పంత్ విషయంలో ఊర్వశీ దారుణంగా ట్రోలింగ్‌కి గురైంది. అతడు తనని కలిసేందుకు తన ఇంటికొచ్చాడని, అలసిపోవడం వల్ల నిద్రపోయానని, ఉదయాన్నే లేచి చూసేసరికి 17 మిస్డ్ కాల్స్ ఉన్నాయంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అప్పుడు రిషభ్ పంత్, ఊర్వశీ మధ్య ట్విటర్ వార్ నడించింది. అయితే.. ఈ విషయంలో రిషభ్‌కే మద్దతు లభించింది. మీడియా అటెన్షన్ పొందడానికే ఊర్వశీ ఇలా ఓవరాక్షన్ చేస్తోందంటూ జనాలు ఆమెను తిట్టిపోశారు.