Unstoppable 2: నటసింహ నందమూరి బాలకృష్ణ ‘ఆహా’లో నిర్వహిస్తోన్న అన్ స్టాపబుల్ రెండో సీజన్ లో ప్రభాస్ గెస్ట్ గా విచ్చేసిన కార్యక్రమం అన్నిటిలోకి మిన్నగా సాగుతోందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకూ అన్ స్టాపబుల్ లో గెస్ట్ గా వచ్చిన వారితో ఎవరికీ రెండు ఎపిసోడ్స్ ప్రసారమయింది లేదు. ఆ క్రెడిట్ బాహుబలి స్టార్ ప్రభాస్ కే దక్కిందని చెప్పవచ్చు. మొదటి ఎపిసోడ్ లో తన మిత్రుడు రామ్ చరణ్ తో ముచ్చట్లు సాగించిన ప్రభాస్ ఈ రెండో ఎపిసోడ్ లో ఆప్త మిత్రుడు గోపీచంద్ ను ఏకంగా ప్రోగ్రామ్ కే ఆహ్వానించారు. ఇక ఇద్దరు మిత్రులతో బాలయ్య తనదైన శైలిలో ఓ ఆట ఆడుకోవడం ఈ రెండో ఎపిసోడ్ ప్రత్యేకత! గోపీచంద్ వెల్ కమ్ లోనే ‘ప్రభాస్ రాణి ఎవరు?’ అన్నది ప్రశ్న. అందుకు ప్రభాస్ తన మిత్రుడు గోపీచంద్ పై దాడికి దిగగా నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అంటూ బాలయ్య, గోపికి అడ్డుగా నిల్చోవడం చూపరులకు భలే వినోదం పంచింది. ఇద్దరు మిత్రులను ఉద్దేశించి బాలయ్య, “ఆయనేమో భీమవరం తెలివితేటలు చూపిస్తాడు.. నువ్వేమీ ఒంగోలు తెలివితేటలు చూపొద్దు..” అనడమూ జనానికి ఆసక్తి కలిగిస్తుంది. ఓ డెస్టినేషన్ మ్యారేజ్ లో ప్రభాస్ ఓ అమ్మాయిని ఓదారుస్తూ ఉండగా, గోపీచంద్ తీసిన ఫోటోను చూపించి వివరాలు రాబట్టడంలోనూ భలే గమ్మత్తు చోటుచేసుకుంది.
గోపీచంద్ సినిమాల పేర్లు వల్లిస్తూ అందులో చివరలో ‘సున్నా’ సెంటిమెంట్ ఉందని, తనకేమో మధ్యలో ‘సున్నా’ సెంటిమెంట్ గా మారిందని “సమరసింహా,నరసింహ,వీరసింహ, సింహా,అఖండ..” అంటూ తన సినిమాల పేర్లు బాలయ్య చెప్పడం నిస్సందేహంగా ఆయన అభిమానులకు కిక్కునిస్తుంది. గోపీచంద్ సినిమా టైటిల్ కు ‘రామబాణం’ అని బాలయ్యనే టైటిల్ పెడుతున్నానని చెప్పడం, ఆ సినిమా వందరోజుల వేడుకకు తాను గెస్ట్ గా వస్తాననీ ఆయన అనడం ఆసక్తి కలిగిస్తుంది. ఇక ప్రభాస్ ‘డార్లింగ్’ అనే పదాన్ని ఎక్కువగా వాడితే, గోపీచంద్ ‘మనిషి’ అనే పదాన్ని ఊతంగా ఉపయోగిస్తుంటాడని ప్రభాస్ తెలిపారు. గోపీచంద్ కు ఎక్కువ ఓపిక అని ప్రభాస్ చెప్పడం, ప్రభాస్ కు చిరాకువస్తే ‘గెటవుట్’ అని అంటాడని గోపీ చెప్పడం మురిపిస్తుంది. 2008లో ఓ హీరోయిన్ కోసం మీరేదో గొడవపడ్డారు అనే ప్రశ్నను సంధించి, ఆన్సర్ చెప్పొద్దు అని బాలయ్య అన్నారు. అందుకు ప్రభాస్ ‘నేనైతే పడలేదు..నువ్వు చెప్పురా..’ అంటూ గోపీకి హింట్ ఇచ్చారు. అందుకు గోపీ ‘2008 కాదు సార్.. అది 2004 లో త్రిష కోసం ‘వర్షం’ సినిమాలో గొడవపడ్డాం’ అని తెలివిగా సమాధానమిచ్చారు. దానికి ‘ఈ ఒంగోలియన్ ట్విస్టులు వద్దు..’ అంటూ బాలయ్య అనడమూ అలరిస్తోంది.
ఇద్దరు మిత్రులకు దీపికా పదుకొణే బొమ్మ చూపించి, ‘హాట్’ అని చెప్పడం, ఆ నేపథ్యంలో సాగిన సంభాషణ సైతం మురిపిస్తుంది. హీరోయిన్ల విషయంలోనూ ప్రభాస్ ను తికమక పెట్టడం కూడా జనానికి వినోదం పంచడం ఖాయం. తరువాత తన పెదనాన్న కృష్ణంరాజు చిత్ర పరిశ్రమలో స్టార్ డమ్ కు చేరుకోవడం విషయాలను గుర్తు చేసుకోవడమూ చూపరులను ఆకట్టుకుంది. కృష్ణంరాజు లేరన్న విషయం తాను టర్కీలో ఉన్నప్పుడు తెలిసిందని, కన్నీళ్లు వచ్చాయని అన్నారు బాలయ్య. ఆ పై కృష్ణంరాజు పాత సినిమాల్లోని గెటప్స్ తో పోలుస్తూ బాహుబలిలోని ప్రభాస్ విజువల్స్ చూపడమూ ఆకట్టుకుంటుంది. ఆ పై ఓ సందర్భంలో ప్రభాస్ కు బాలయ్య హగ్ ఇవ్వడం, ఆ తరువాత ఏమయ్యా నేను హగ్ ఇవ్వొద్దా అంటే, దానికి ‘జై బాలయ్యా…’ అంటూ ప్రభాస్ చెప్పడం బాలకృష్ణ అభిమానులకు ఆనందం పంచే విషయం!
చిన్నారి గాయని లక్ష్మీ మనోజ్ఞ సింహ చివరలో స్పెషల్ గెస్ట్ గా విచ్చేయడం, ఆమెను అందరూ అభినందించడం చోటుచేసుకుంది. లక్ష్మీ మనోజ్ఞ క్యాన్సర్ ను జయించి ముందుకు సాగుతోంది. ఆమెపై రూపొందిన వీడియోలో ‘ఎన్ని సమస్యలు వచ్చినా, అన్ స్టాపబుల్ గా ముందుకు సాగడమే తన లక్ష్యం’ అని లక్ష్మీ మనోజ్ఞ చెప్పడం కూడా అందరిలోనూ స్ఫూర్తిని నింపుతుంది. ఆమె కథను పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ చూడవలసిందే! ఆ పాపకు తన తరువాతి చిత్రంలో గాయనిగా అవకాశం ఇస్తానని గోపీచంద్ చెప్పారు.
ఇలాంటి బోలెడు విశేషాలతో ప్రభాస్ తో రూపొందిన సెకండ్ ఎపిసోడ్ సాగింది. మొదటి ఎపిసోడ్ తో పోలిస్తే ఈ రెండో ఎపిసోడ్ ఎక్కువ నిడివితో రూపొందడమే కాదు, ఎక్కువ అంశాలకు తావిచ్చి, వినోదాన్ని సైతం రెట్టింపు చేస్తుంది. ఈ ఎపిసోడ్ ప్రభాస్, గోపీచంద్ అభిమానులను విశేషంగా అలరిస్తుందని చెప్పవచ్చు. ఇక బాలయ్య ఫ్యాన్స్ కు ఎలాంటి ఎనర్జీ ఇస్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.