Yashoda: సమంత టైటిల్ రోల్ ప్లే చేసిన సినిమా ‘యశోద’. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ నెల 11వ తేదీ వివిధ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించారు మలయాళ నటుడు ఉన్ని ముకుందన్. ‘యశోద’ సినిమా విడుదల సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు సమంత అనారోగ్యంతో ఉన్నట్టు తెలియదని చెప్పారు.
సమంతతో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ను తెలియచేస్తూ, ”సమంత చాలా డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్. తన పాత్ర కోసం ఆవిడ చాలా ప్రిపేర్ అయ్యారు. ఫైట్స్ బాగా చేశారు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ చేశారు. సెట్‌లో ఇతర ఆర్టిస్టులతో చక్కగా మాట్లాడతారు. ఒక సన్నివేశం చేసేటప్పుడు ఎలా చేస్తే బావుంటుందని ఐడియాస్ డిస్కస్ చేసుకున్నాం. మలయాళంలో వర్కింగ్ స్టైల్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. నటుడిగా రిహార్సల్స్ ఇవ్వడానికి నేను కొంచెం ఆలోచిస్తా. మలయాళ సినిమా సెట్‌లో ఇతర ఆర్టిస్టులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని చూస్తా. ముందు ఏం చేస్తానో చెప్పను. డైరెక్ట్ కెమెరా ముందు చేసి చూపిస్తా. అప్పుడు వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ నేచురల్‌గా ఉంటాయి. నిజానికి ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు నాకు సమంత ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం తెలియదు. సమంత చాలా ప్రొఫెషనల్‌గా ఉన్నారు. ఎప్పుడూ తాను అటువంటి వ్యాధితో పోరాటం చేస్తున్నాని చెప్పలేదు. సమంత పోస్ట్ చూసి శాడ్ గా ఫీలయ్యాను. సమంతను దగ్గర నుంచి చూసి వ్యక్తిగా ఆవిడ మైయోసిటిస్‌తో పోరాటం చేస్తారు. ఆరోగ్యంతో మన ముందుకు వస్తారని నమ్ముతున్నాను” అని అన్నారు.
ఈ చిత్రంలో తాను పోషించింది డాక్టర్ పాత్ర అని అందరూ ట్రైలర్ చూసి భావిస్తున్నారని, అయితే ఆ పాత్రకు సంబంధించి చాలా లోతైన అంశాలు ఉన్నాయని, వాటిని ఇప్పుడే రివీల్ చేయడం సబబు కాదని ఉన్ని ముకుందన్ తెలిపారు. ‘జనతా గ్యారేజ్, భాగమతి, ఖిలాడీ’ తర్వాత ఉన్ని ముకుందన్ తెలుగులో చేస్తున్న నాలుగో చిత్రమిది. చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గురించి మాట్లాడుతూ, ”ఆయన చాలా హంబుల్ పర్సన్. వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఆయన గురించి చాలా తెలుసుకున్నాను. స్టోరీ లైన్, స్క్రిప్ట్‌లో ప్రతిదీ ఆయనకు తెలుసు. ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏం కావాలన్నా ఇస్తారు. ఎప్పుడూ సినిమా బాగా రావాలని ఆశిస్తారు. దానికి ఏం చేయడానికి అయినా రెడీగా ఉంటారు. మా టీమ్, డైరెక్టర్స్ అంతా శ్రీదేవి మూవీస్ సంస్థకు కృతజ్ఞతతో ఉండాలి. ‘యశోద’ ఫ్యూచరిస్టిక్ స్టోరీ ఐడియా. మన సొసైటీ ఎటు వెళుతుందనేది చూపిస్తున్నారు. త్వరలో అది రియాలిటీగా మారుతుంది” అని అన్నారు. ఈ కథ గురించి వివరిస్తూ, ”సరోగసీ అనేది వ్యక్తిగత పరమైన అంశం. చట్టప్రకారం సరోగసీని ఆశ్రయించినప్పుడు ఎవరికి ఎటువంటి సమస్య ఉండదు. సరోగసీ అనేది చెప్పడం సులభమే. కానీ, అదొక ఎమోషనల్ జర్నీ. ఈజీగా దానిపై కామెంట్ చేయకూడదు. సైంటిఫిక్‌గా చూస్తే… మిరాకిల్. పురాణాల్లో మనం అటువంటి వాటి గురించి విన్నాం” అని అన్నారు. ప్రస్తుతం మలయాళంలో రెండు మూడు చిత్రాలు చేస్తున్నానని, అందులో ‘మాలికాపురం’ అనే సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీస్తున్నారని, అది తెలుగులోనూ విడుదల అవుతుందని ఉన్ని ముకుందన్ తెలిపారు.