సినీ పరిశ్రమలో మంచి మార్కెట్ & ఫాలోయింగ్ ఉండి.. క్రేజీ ఆఫర్లు వస్తున్న సమయంలో ఏ హీరో అయినా రిటైర్మెంట్ ప్రకటిస్తారా? కానీ, ఓ స్టార్ అలాంటి సంచలన నిర్ణయమే తీసుకున్నాడు. ఇకపై సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అతడే.. ఉదయనిధి స్టాలిన్. ‘ఓకే ఓకే’ అనే డబ్బింగ్ సినిమాతో ఇతడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు. తమిళనాటలో ఉన్న హీరోల్లో ఇతనికీ ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇతని సినిమాలు మంచి బిజినెస్ చేస్తాయి కూడా!
ప్రస్తుతం ఉదయనిధి నటించిన నెంజుకు నీధి సినిమా మే 20న విడుదలకి సిద్ధమవుతోంది. ఇది బాలీవుడ్‌లో హిట్టైన ‘ఆర్టికల్ 15’కి రీమేక్. ఇది కాకుండా మారి సెల్వరాజ్ డైరెక్షన్‌లో ‘మామన్నన్’ అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తుండగా, ఫహాద్ ఫాజిల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇదే తన చివరి సినిమా అంటూ ఓ ఇంటర్వ్యూలో ఇతను షాకిచ్చాడు. ఇందుకు కారణం రాజకీయాలేనని క్లారిటీ ఇచ్చాడు. ఇటు పాలిటిక్స్, అటు సినిమాల్ని బ్యాలెన్స్ చేయడం తనకు చాలా కష్టమవుతోందని.. అందుకే సినిమాలకు గుడ్‌బై చెప్పాలని తాను డెసిషన్ తీసుకున్నానని బాంబ్ పేల్చాడు.
ప్రస్తుతం తమిళనాడు సీఎం అయిన ఎంకే స్టాలిన్ తనయుడే ఉదయనిధి స్టాలిన్. తండ్రిలాగే తానూ రాజకీయాల్లో సెటిల్ అవ్వాలని ఉదయనిధి ఆలోచిస్తున్నట్టు తెలిసింది. నిజానికి.. గత ఎన్నికల్లో పోటీ చేసి, ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే ఉదయనిధి సినిమాలకి దూరం అవుతాడని టాక్ నడిచింది. కానీ, అలా జరగలేదు. అయితే, ఈసారి మాత్రం స్వస్తి పలుకుతున్నట్టు తనే అధికారికంగా ప్రకటించాడు ఉదయనిధి స్టాలిన్.