Shivaratri: ఫిబ్రవరి ఫస్ట్ వీకెండ్ లో ఏడు చిత్రాలు జనం ముందుకు వచ్చాయి. ఇక ఈ వారంలో తొమ్మిది చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ నెల మూడో వారంలో మహాశివరాత్రి కానుకగా కూడా భారీగానే సినిమాలు విడుదల అవుతాయని అంతా భావించారు. కానీ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావాల్సిన తెలుగు సినిమాలు ‘శాకుంతలం, ధమ్కీ’ విడుదల వాయిదా పడింది. ఇంకా మేకర్స్ అధికారికంగా ఈ విషయాన్ని చెప్పకపోయినా… మరో రెండు చిన్న సినిమాలు ఈ డేట్ కే వస్తున్నట్టు ప్రకటించడంతో అది నిజమే అనిపిస్తోంది.
‘అల వైకుంఠపురంలో’ హిందీ రీమేక్ ‘శహజాదా’ రిలీజ్ ఈ నెల 10 నుండి 17కి వాయిదా పడటంతో ఉత్తరాదిలో తమకు తగినన్ని థియేటర్లు దొరకపోవచ్చుననే అనుమానాన్ని ‘శాకుంతలం, ధమ్కీ’ చిత్రాల నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారట. తమ చిత్రాల విడుదలకు వారు దీనిని కారణంగా చెబుతున్నారని తెలుస్తోంది. దాంతో ఈ నెల 17న ధనుష్ ద్విభాషా చిత్రం ‘సార్’, కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’, చిత్రాలు మాత్రమే వస్తాయని అంటున్నారు. అలానే ఆ మర్నాడు అంటే ఫిబ్రవరి 18వ తేదీన మరో రెండు సినిమాలు కూడా విడుదలకు సిద్ధమౌతున్నాయి. అందులో ఒకటి చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల, అల్లుడు విష్ణు ప్రసాద్ నిర్మించిన ‘శ్రీదేవి శోభన్ బాబు’ ఒకటి. ఈ సినిమా తొలి కాపీ ఎప్పుడో సిద్ధమైనా… అనివార్య కారణాల వల్ల విడుదల ఆలస్యమైంది. అలానే సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావుతో తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మించిన ‘ఊ అంటావా మావ… ఊ ఊ అంటావా మావ’ కూడా అదే రోజున రాబోతోంది. ‘శ్రీదేవి శోభన్ బాబు’లో సంతోష్ శోభన్, గౌరి జి కిషన్ జంటగా నటించారు. గత నెలలో సంతోష్ శోభన్ నటించిన ‘కళ్యాణం కమనీయం’ సంక్రాంతి కానుకగా వచ్చింది. ఇప్పుడు శివరాత్రి కానుకగా ఇది వస్తోంది. ఈ యేడాది సంతోష్ శోభన్ కు ఇది రెండో సినిమా. ఈ చిత్రం ద్వారా ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక హారర్ కామెడీగా రూపొందిన ‘ఊ అంటావా మావ… ఊ ఊ అంటావా మావ’ చిత్రంలో యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ప్రధాన పాత్రలు పోషించారు. మరి శివరాత్రికి రాబోతున్న చిత్రాలలో ఏ యే చిత్రాలు ప్రేక్షకాదరణ పొందుతాయో చూడాలి.