నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికీ’ మూవీ ఈ నెల 10న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ మూవీతో మలయాళ నటి, ఫహద్ ఫాజిల్ భార్య నజ్రియా నజీమ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. విశేషం ఏమంటే… ఈ సినిమాలో మరో పాపులర్ హీరోయిన్ కూడా నటించిందని సమాచారం. ఆమె మరెవరో కాదు… ‘కృష్ణార్జున యుద్ధం’లో నాని సరసన నటించిన అనుపమా పరమేశ్వరన్! ఆమె ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించిందని, సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ ఆమె పాత్ర ఉంటుందని అంటున్నారు. ఆడియెన్స్ కు స్వీట్ సర్ ప్రైజ్ ఇవ్వాలని ఆమె పాత్రను ఎక్కడా ప్రమోషన్స్ లో చూపలేదట. బట్ ఆ మధ్య వచ్చిన ట్రైలర్ లో మాత్రం అనుపమా పరమేశ్వరన్ ముఖం కనిపించకుండా ఆమెను వెనుక నుండి చూపారు. హీరో సుందర్ అమెరికా ప్రయాణానికి, అతని ప్రేమ సఫలం కావడానికి అనుపమ పోషించిన పాత్ర సహాయపడుతుందని తెలుస్తోంది. ఈ యేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘రౌడీ బాయ్స్’లో హీరోయిన్ గా నటించిన అనుపమా పరమేశ్వరన్, ప్రస్తుతం ’18 పేజీస్, కార్తికేయ 2’ చిత్రాలతో పాటు థ్రిల్లర్ మూవీ ‘బట్టర్ ఫ్లై’లోనూ నటిస్తోంది.
‘అంటే సుందరానికీ..’ మూవీని ‘ఆహా సుందర’ పేరుతో మలయాళంలో రిలీజ్ చేస్తున్నారు. అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం మలయాళీ నటీమణులను బాగానే ఈ సినిమాలో నటింపచేశారు. నజ్రియా తో పాటు అనుపమా పరమేశ్వర్ కూడా మలయాళంలో చక్కని గుర్తింపు ఉన్న కథానాయికే. అలానే హీరోయిన్ అక్కగా నటించిన తన్వీ రామ్ కూ మల్లూవుడ్ లో మంచి పేరుంది. ఇక ఇందులో హీరో సుందర్ ను మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ అభిమానిగా చూపించారట. ‘అంటే సుందరానికీ’ మూవీకి దర్శక నిర్మాతలు చేస్తున్న ప్రచారానికి మించి సమ్ థింగ్ స్పెషల్ గా కథ, కథనం, నటీనటుల అభినయం ఉంటుందని అనిపిస్తోంది.