హీరోగా జూనియర్ యన్టీఆర్ కెరీర్ మొదలైన రోజుల్లో ఆయనకు ఓ సక్సెస్, ఓ ఫెయిల్యూర్ పలకరిస్తూ వచ్చాయి. అయితే జూనియర్ కు అదరహో అనే స్థాయిలో సక్సెస్ ను అందించిన తొలి చిత్రం ‘ఆది’. దాని తరువాత వచ్చే సినిమా ఫట్ అవుతుందని సెంటిమెంట్ ప్రకారం చాలామంది భావించారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ‘ఆది’ తరువాత వచ్చిన ‘అల్లరి రాముడు’ విజయం సాధించింది. 2002 జూలై 18న జనం ముందు నిలచిన ‘అల్లరి రాముడు’ వారి మనసులు గెలిచాడు.
‘అల్లరి రాముడు’ కథ ఏమిటంటే- ధనాహంకారంతో కొట్టుమిట్టాడుతూ, తన వర్కర్స్ నీళ్ళడిగినా కొట్టిస్తుంది చాముండేశ్వరి. దానిని ఆమె సొంత కూతురు మైథిలి, ఆమె భర్త ఖండిస్తారు. అలాంటి చాముండేశ్వరి ఇంటిలో పనివాడు కావలసి వస్తే రాముడు చేరతాడు. అతని పనితీరు నచ్చిన చాముండేశ్వరి సంతోషిస్తుంది. ఊళ్ళో రాముని మరదలు రుక్మిణి, అతణ్ణి ప్రేమిస్తూ ఉంటుంది. ఓ సారి మైథిలిని గేలి చేసిన ఓ రాజకీయ నాయకుని కొడుకును రాముడు చితక్కొడతాడు. దాంతో రాముడిపై మైథిలి మనసు పారేసుకుంటుంది. రాజకీయ నాయకుని కొడుకుతోనే మైథిలి పెళ్ళి చేయాలనుకుంటుంది చాముండేశ్వరి. మైథిలి తన మనసులోని మాట రామునితో చెబుతుంది. తనను పెళ్ళి చేసుకోకుంటే చస్తానంటుంది. రాము ఆమె ప్రేమను అంగీకరిస్తాడు. ఇది తెలిసిన చాముండేశ్వరి, రాముణ్ణి పోలీసులతో కొట్టిస్తుంది. కానీ, రాముణ్ణే చేసుకుంటానని మైథిలి భీష్మించుకుంటుంది. ఫ్యాక్షనిస్టు అయిన తన తండ్రికి ఫోన్ చేసి రప్పిస్తుంది చాముండేశ్వరి. అప్పుడే రాముడి తాత రామచంద్రయ్య కూడా వస్తాడు. చిన్నతనంలోనే రాముడు, మైథిలి మెడలో తాళి కట్టి ఉంటాడు. అందువల్ల రాముడికి మైథిలిపై హక్కుఉందని చెబుతాడు. రాజకీయ నాయకుడి కొడుకుతో మైథిలి పెళ్ళి జరపాలని చూస్తారు. మైథిలి విషం మింగుతుంది. కూతురు ప్రేమకు చాముండేశ్వరి సైతం కరిగిపోతుంది. కానీ, రాజకీయ నాయకుడు మైథిలి చచ్చినా దాని శవానికైనా తన కొడుకుతో తాళి కట్టిస్తానంటాడు. వాళ్ళందరినీ చితక బాది, మైథిలిని ఆసుపత్రిలో చేర్పిస్తాడు రాముడు. మైథిలి ప్రాణాలతో బయట పడుతుంది. చివరకు చాముండేశ్వరి స్వయంగా రాముడికి తాళి ఇచ్చి, కూతురు మెడలో కట్టిస్తుంది. కథ సుఖాంతమవుతుంది.
ఈ చిత్రంలో జూనియర్ యన్టీఆర్ సరసన ఆర్తి అగర్వాల్, గజాల నటించారు. నగ్మా, నరేశ్, కె.విశ్వనాథ్, జయప్రకాశ్ రెడ్డి, ఆహుతి ప్రసాద్, పరుచూరి వెంకటేశ్వరరావు, పావలా శ్యామల, ఎల్.బి. శ్రీరామ్, అచ్యుత్, రఘుబాబు, వైజాగ్ ప్రసాద్, రజిత నటించారు. ‘ఫ్రెండ్లీ మూవీస్’ పతాకంపై బి.గోపాల్ దర్శకత్వంలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ చంటి అడ్డాల ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ రచన చేయగా, ఆర్పీ పట్నాయక్ సంగీతం సమకూర్చారు. చైతన్య ప్రసాద్, పోతుల రవికిరణ్ పాటలు పలికించారు. ఇందులోని “రెండువేల రెండు వరకు…”, “జడకు జడ…”, “బొడ్డును చూడయ్యో…”, “రుక్కుమినీ…”, “ఒప్పుల కుప్పా…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఈ సినిమా అనేక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.
చిత్రసీమలో ‘రాముడు’ అన్న టైటిల్స్ తో అత్యధిక చిత్రాలలో నటించి, ఘనవిజయం సాధించిన ఘనత నటరత్న యన్టీఆర్ కే దక్కుతుంది. అందువల్ల జూనియర్ యన్టీఆర్ ‘అల్లరి రాముడు’ అన్న టైటిల్ తో వస్తున్నాడని తెలియగానే అభిమానుల అంచనాలు పెరిగాయి. అలాగే జూనియర్ బాబాయ్ బాలకృష్ణతో దర్శకుడు బి.గోపాల్ అపూర్వ విజయాలు సాధించారు. అందువల్ల బి.గోపాల్ డైరెక్షన్ లో జూనియర్ నటిస్తున్న ‘అల్లరి రాముడు’పై ఫ్యాన్స్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ తీరున ఆరంభం నుంచీ ‘అల్లరి రాముడు’కు ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. అందుకు తగ్గట్టుగానే సినిమా జనాదరణ పొందింది. యన్టీఆర్ సూపర్ హిట్ మూవీ ‘వేటగాడు’లోని “ఆకుచాటు పిందె తడిసె…” బాణీల్లోనే ఇందులో “రెండు వేల రెండు వరకు…” పాట రూపొందడం కూడా చిత్ర విజయానికి దోహదం చేసిందని చెప్పవచ్చు.