‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ మూవీకి త్రివిక్రమ్ కంట్రిబ్యూషన్ ఏమిటనేది పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ లేకపోతే ‘భీమ్లా నాయక్’ మూవీనే లేదని దర్శకుడు సాగర్ కె చంద్ర తెలిపాడు. మాటల రచయిత నుండి దర్శకుడిగా మారినా త్రివిక్రమ్ కలం పదను ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించింది ‘భీమ్లానాయక్’ మూవీ. అంతేకాదు… స్క్రీన్ ప్లే విషయంలోనూ త్రివిక్రమ్ సత్తాను ఇంకోసారి చాటింది. సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ త్రివిక్రమ్ మాటలు నటీనటుల నోటి నుండి తూటాల్లా వెలువడి థియేటర్స్ లో చప్పట్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఓపెనింగ్ షాట్ లో పవన్ కళ్యాణ్ నోటి నుండి అడవి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడతాను అని ఇచ్చిన హామీని మూవీ క్లయిమాక్స్ కు లింక్ చేయడం త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే ప్రతిభ తార్కాణం. అలానే మలయాళ మాతృకకు భిన్నంగా భీమ్లా నాయక్ కు ఓ ఫ్లాష్ బ్యాక్ పెట్టడంతో మూవీకి మరింత బలం చేకూరింది. మలయాళ సినిమాను చూసినప్పుడు కేవలం ఇద్దరు ఇగోయిస్టిక్ పర్సన్స్ మధ్య సాగే డ్రామాగా అనిపిస్తుంది. కానీ ‘భీమ్లా నాయక్’ దగ్గరకు వచ్చేసరికీ ఈ మార్పులు, చేర్పులతో ఓ ఇదో ఫుల్ ఫ్లెడ్జ్ మాస్ మూవీలా తలపించింది.
Read Also : Bheemla Nayak : ఆర్జీవీ రివ్యూ… ఏమన్నాడంటే?
మాతృకలోని మట్టి వాసన చెదరకుండా, దానికంటే ఇంకా మెరుగ్గా ‘భీమ్లానాయక్’ రూపుదిద్దుకుంది. ఆ రకంగా త్రివిక్రమ్ తనదైన మ్యాజిక్ చేశాడు. గతంలో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలకు త్రివిక్రమ్ రచన ఎలా దన్నుగా నిలిచిందో, ఇప్పుడూ యువ దర్శకుడు సాగర్ కె చంద్ర టేకింగ్ కు త్రివిక్రమ్ కలం బలం బాసటగా నిలిచింది. గత యేడాది వచ్చిన ‘వకీల్ సాబ్’లోని సంభాషణలు పవన్ కళ్యాణ్ లోని జనసేన నేత ను దృష్టిలో పెట్టుకుని రాయగా, ఈ సినిమాలో త్రివిక్రమ్ రాజకీయ పోకడలకు పోకుండా పవన్ కళ్యాణ్ లోని పవర్ స్టార్ ను దృష్టిలో పెట్టుకుని రాసినట్టు అనిపిస్తోంది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ బయట రానా ‘భీమ్లా నాయక్ ఈ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ’ అంటూ చెప్పిన డైలాగ్ అలాంటిదే! అడవిని అమ్మతో కాకుండా అమ్మోరుతో పోల్చడం గొప్పగా ఉంది. ‘భీమ్లా నాయక్’ మూవీ స్టార్ట్ టూ ఫినిష్ వరకూ బోర్ కొట్టకుండా రేసీగా సాగడానికి త్రివిక్రమ్ సంభాషణలు, చిత్రానువాదమే ప్రధాన కారణం.