గతంలో ఒక తమిళ స్టార్ డైరెక్టర్ తీసిన ఒక భారీ బడ్జట్ సినిమా తెలుగులో అంతగా ఆడలేదు. పేరుకి, ప్రమోషన్స్ కి పాన్ ఇండియా సినిమా అన్నారు కానీ సినిమా మొత్తం తమిళ నేటివిటీ ఉంది అనే కామెంట్స్ ఆ భారీ బడ్జట్ సినిమాపై గట్టిగానే వినిపించాయి. అర్ధం కాకపోవడం, నేటివిటీ ఇష్యూస్, లాగ్ లాంటి పలు కారణాల వలన ఆ పాన్ ఇండియా సినిమా తెలుగులో ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో తమిళ క్రిటిక్స్ కొంతమంది, మరికొంతమంది తమిళ సినీ అభిమానులు కూడా తెలుగు సినీ అభిమానులపై, తెలుగు క్రిటిక్స్ పై నెగటివ్ కామెంట్స్ చేసారు. మీ సినిమాలు కోలీవుడ్ లో ఎలా హిట్ అవుతాయో చూస్తాం అనే వరకూ ఆ విమర్శలు వెళ్లాయి. ఆ సమయంలో కొంతమంది బయటకి వచ్చి తమిళ సినిమాలు తమిళ్ లో కన్నా తెలుగులో హిట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని గుర్తు చేసారు. ఈ విషయాన్నే మరోసారి నిరూపిస్తోంది 2018 సినిమా.
టోవినో థామస్ హీరోగా నటించిన ఈ మలయాళ మూవీ అక్కడ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. 160 కోట్లకి పైగా రాబట్టి కేరళ బాక్సాఫీస్ షేక్ చేసిన ఈ మూవీని తెలుగులో బన్నీ వాసు రిలీజ్ చేసాడు. ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయని 2018 మూవీ కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కింది. అసలు ఇక్కడి కథ కాదు, ఇక్కడ తెలిసిన ఆర్టిస్టులు కాదు భారీగా ప్రమోట్ చేసిన సినిమా కూడా కాదు. ఇన్ని నెగటివ్ పాయింట్స్ ఉన్నా కూడా సినిమా బాగుండడంతో 2018 మూవీకి తెలుగు సినీ అభిమానులు హిట్ టాక్ తో పాటు భారీ కలెక్షన్స్ కూడా ఇస్తున్నారు. డే 1 కన్నా డే 3 ఎక్కువ కలెక్షన్స్ ని రాబట్టింది అంటే 2018 మూవీని మన ఆడియన్స్ ఎంతగా ఆదరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. మరో వారం పాటు పెద్దగా ఇంపాక్ట్ చూపించే సినిమాలు విడుదల కావట్లేదు కాబట్టి దాదాపు 2018 సినిమా హవానే కొనసాగుతుంది. ఇలా మంచి సినిమాలు తీస్తే తెలుగు సినీ అభిమానులు ఆదరిస్తారు అని ప్రేక్షకులు మరోసారి ప్రూవ్ చేసారు.