ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ హైప్రొఫైల్ భేటీకి రంగం సిద్ధమైంది. చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ బృందం ఈరోజు జగన్‌ను కలవడానికి బయల్దేరారు. టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సమావేశానికి చిరంజీవితో పాటు తెలుగు సూపర్ స్టార్లు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రాజమౌళి, కొరటాల శివ, అలీతో పాటు మొత్తం 9 మంది హాజరు కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ ధరలపై, ఇండస్ట్రీలోని పలు సమస్యలపై ఈ భేటీలో చర్చలు జరగనున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకూ కొనసాగుతుంది.
Read Also : Alia Bhatt : అల్లు అర్జున్ కోసం పేరు చేంజ్… ఆలు అల్లుతో ఎప్పుడు ?
ఇప్పటికే సీఎంతో భేటీ కోసం టాలీవుడ్ స్టార్స్ అంతా విజయవాడకు చేరుకున్నారు. చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్, మహేష్ బాబు, కొరటాల శివ, పోసాని, అలీ, ఆర్ నారాయణమూర్తి, నిర్మాత నిరంజన్ రెడ్డి గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ కు బయల్దేరారు. కాసేపట్లో సీఎంతో సినీ ప్రముఖుల భేటీ ప్రారంభం కానుంది. అయితే బేగం పేట ఎయిర్ పోర్టులో చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ “సీఎం జగన్ నుంచి నాకు ఆహ్వానం అందింది. ఇంకా ఎవరెవరు వస్తున్నారనేది నాకు తెలియదు. టాలీవుడ్‌లో నెలకొన్న సమస్యలకు ఇవాళ్టితో శుభం కార్డు పడుతుంది.. సీఎం జగన్‌తో సమావేశం ముగిసిన తర్వాత అన్ని విషయాలు చెబుతాం” అని అన్నారు. ఈ భేటీ ముగిసిన వెంటనే సానుకూల ప్రకటన వస్తుందని టాలీవుడ్ భావిస్తోంది. ప్రస్తుతం ఈ భేటీలో టాలీవుడ్ స్టార్ హీరోలంతా పాల్గొనడంతో సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.