‘బాహుబలి – ద బిగినింగ్’ తరువాత ‘బాహుబలి- ద కంక్లూజన్’కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ స్థాయిలో కాకపోయినా, ఇప్పుడు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్, యశ్ హీరోగా తెరకెక్కించిన ‘కే.జి.ఎఫ్.- ఛాప్టర్ 2’ కు మొదటి భాగం గ్రాండ్ సక్సెస్ తో మంచి క్రేజ్ ఏర్పడిందనే చెప్పాలి. ఈ సినిమా వస్తోందని తెలిసి, ఉత్తరాదిన సైతం కొన్ని డైరెక్ట్ గా రూపొందిన హిందీ చిత్రాలు పక్కకు తప్పుకున్నాయి. దీనిని బట్టే, ‘కేజీఎఫ్-2’కు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతోంది. అయితే, సినీ ఫ్యాన్స్, ట్రేడ్ పండిట్స్ ఇప్పటి దాకా మన దేశంలో ఓ హిట్ మూవీకి తరువాత వచ్చిన సీక్వెల్స్ మొదటి భాగం అంతగా క్లిక్ కాలేదనే సెంటిమెంట్ ను బయటకు తీస్తున్నారు. ఎందుకలాగా!?
హాలీవుడ్ లోనూ, ఇతర దేశాల్లో ఏమో కానీ, మన దేశంలో ముఖ్యంగా మన తెలుగునాట సీక్వెల్స్ కు పెద్ద సీన్ లేదు అంటూ ఉంటారు సినీజనం. ఆ మాటకొస్తే తెలుగులోనే కాదు, భారతదేశంలోనే సీక్వెల్స్ లో మొదటి భాగాని కంటే మిన్నగా విజయం సాధించి, బ్లాక్ బస్టర్ గా నిలచిన ఏకైక చిత్రం రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’ అనే చెప్పాలి. సీక్వెల్స్ లాగే ‘ఫ్రాంచైజీస్’ కూడా వస్తున్నాయి. సీక్వెల్స్ కు , ఈ ‘ఫ్రాంచైజీస్’కు తేడా ఏమిటంటే, ఓ కథకు కొనసాగింపుగా సాగేది ‘సీక్వెల్’. అలా కాకుండా ఓ చిత్రంలోని కొన్ని పాత్రలు మరో కథలోనూ ప్రత్యక్షం కావడం ‘ఫ్రాంచైజీ’. ఇలా ఈ రెండు కేటగిరీలు ఉన్నా, జనం మాత్రం ఓ సినిమా టైటిల్ తో రూపొంది, తరువాత అదే టైటిల్స్ పార్ట్ 1, పార్ట్ 2 అంటూ పేర్కొనడాన్ని సీక్వెల్స్ అని భ్రమిస్తున్నారు. చరిత్రలోకి తొంగి చూస్తే ఇలాంటి కథలు ఇప్పుడే కాదు 1943లోనే వెలుగు చూశాయి. ‘ఫియర్ లెస్’ నాడియా నటించిన ‘హంటర్ వాలీ’ (1935) చిత్రానికి సీక్వెల్ గా ‘హంటర్ వాలీ కీ బేటీ’ (1943)లో రూపొందింది. ‘హంటర్ వాలీ’కి వచ్చిన క్రేజ్ రెండో భాగానికి లభించలేదు. ఇక విఖ్యాత భారతీయ దర్శకులు సత్య జిత్ రే తెరకెక్కించిన తొలి చిత్రం ‘పథేర్ పాంచాలి’కి సీక్వెల్స్ గా ‘అపరాజితో’, ‘అపూ సంసార్’ చిత్రాలు తెరకెక్కాయి. ‘పథేర్ పాంచాలి’కి సీక్వెల్స్ గా వచ్చిన రెండు సినిమాలు మొదటి భాగం అంత పేరు సంపాదించ లేకపోయాయి. ఈ మూడు సినిమాలు ‘అపూ ట్రయాలజీ’గా ఎంతో పేరు సంపాదించినప్పటికీ, ఇప్పటికీ సత్యజిత్ రే పేరు వినగానే ‘పథేర్ పాంచాలి’యే ముందుగా గుర్తుకు వస్తుంది. తరువాత కూడా రే తన ‘కాంచన్ జంగా’కు సీక్వెల్ తీశారు. ఆ పై ‘గూపీ గైన్ బాఘా బైన్’ ట్రయాలజీ తెరకెక్కించారు. రే పంథాలోనే మరికొందరు బెంగాలీ బాబులు పయనించారు. అయితే అందరికీ తొలి భాగం పేరు తెచ్చినట్టుగా మలి భాగాలు కీర్తిని ప్రసాదించలేకపోయాయనే చెప్పాలి.
తరువాతి రోజుల్లో హిందీలో శ్రీదేవి నటించిన ‘నగీనా’కు ‘నిగాహె’ సీక్వెల్ గా రూపొందింది. రెండూ ఆదరణ పొందినా, ‘నగీనా’ స్థాయిలో తరువాతి భాగం అలరించలేకపోయింది. అమితాబ్ బచ్చన్ తో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘సర్కార్’ ట్రయాలజీ లోనూ మొదటి భాగం స్థాయిలో తరువాతి భాగాలు అలరించలేక పోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే సీక్వెల్స్ లో రెండో భాగాలకు పెద్దగా సీన్ కనిపించదు. అయితే ఫ్రాంచైజీల్లో కొన్ని మొదటి భాగం కంటే మిన్నగా అలరించినవి ఉన్నాయి. అలాంటి వాటిలో “ధూమ్, రేస్, గోల్ మాల్, మున్నాభాయ్, దబంగ్ ” వంటివి కొన్ని కనిపిస్తాయి. వీటిలోనూ కొన్ని మొదట వచ్చిన వాటి స్థాయిలో అలరించలేదనే చెప్పాలి.
మన తెలుగునాట మాత్రం సీక్వెల్స్ కు శ్రీకారం చుట్టినవారు రామ్ గోపాల్ వర్మ అనే చెప్పాలి. ఆయన శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో నిర్మించిన ‘మనీ’ సినిమాకు సీక్వెల్ గా ‘మనీ మనీ’ వచ్చి అలరించలేక పోయింది. అలాగే రాము తెరకెక్కించిన ‘రక్తచరిత్ర’ రెండు భాగాల్లో మొదటి సినిమా స్థాయిలో రెండో చిత్రం ఆకట్టుకోలేక పోయింది. ‘దృశ్యం’అలరించిన తీరున రెండోది మురిపించలేదనే చెప్పాలి. ‘యన్టీఆర్- కథానాయకుడు’ తరువాత వచ్చిన ‘యన్టీఆర్ – మహానాయకుడు’ మొదటి దానికంటే మిన్నగా ఏమీ ఆకట్టుకోలేదు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సీక్వెల్ గా వచ్చిన ‘బంగార్రాజు’ మొదటి దానిలా మురిపించలేకపోయింది. ఈ నేపథ్యంలో ‘ఎఫ్-2’కు సీక్వెల్ గా రానున్న ‘ఎఫ్-3’పైనా, ‘పుష్ప – ద రైజ్’కు సీక్వెల్ గా రాబోతున్న ‘పుష్ప – ద రూల్’పైనా ఆసక్తి నెలకొంది. అయితే ఈ లోగా కన్నడ చిత్రం ‘కెజీఎఫ్-2’ సీక్వెల్ గా వస్తోంది. దాంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నెల 14న ‘కేజీఎఫ్-2’ కన్నడతో పాటు తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లోనూ పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. మరి ఈ పాన్ ఇండియా మూవీ ‘బాహుబలి’ సీక్వెల్ లాగా విజయం సాధిస్తుందో లేదో చూడాలని సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఏమవుతుందో చూడాలి.