గత వారం రెండు అనువాద చిత్రాలతో కలిపి మొత్తం ఆరు సినిమాలు జనం ముందుకు వచ్చాయి. ఈ వీకెండ్ రెండు డబ్బింగ్ మూవీస్ తో కలిపి ఎనిమిది సినిమాలు విడుదల కాబోతుండటం విశేషం. శింబు నటించిన ‘వెందు తనిందదు కాడు’ మూవీ తెలుగులో ‘ముత్తు’ పేరుతో గురువారమే జనం ముందుకు వచ్చేస్తోంది. గౌతమ్ వాసుదేవ మీనన్, శింబుది హిట్ కాంబినేషన్ కావడంతో సహజంగానే ఈ సినిమా మీద కూడా అంచనాలు పెరిగాయి. ఈ మూవీని తెలుగులో స్రవంతి మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేస్తుండటం విశేషం.
శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె దివ్యదీప్తి నిర్మించిన మొదటి సినిమా ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’. కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీధర్ గాదె తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం జనం ముందుకు వస్తోంది. కిరణ్ అబ్బవరం, శ్రీధర్ గాదె కాంబినేషన్ లో వచ్చిన ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’ విజయం సాధించడంతో ఈ సినిమా విజయంపై కిరణ్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇక మరో సక్సెస్ ఫుల్ కాంబో కూడా ఈ శుక్రవారమే తమ చిత్రాన్ని జనం ముందుకు తీసుకొస్తోంది. వాళ్ళే సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ. వీరిద్దరికి తొలి కలయికలో ‘సమ్మోహనం’ చిత్రం వచ్చి మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ‘వి’ సినిమాలోనూ నానితో పాటు సుధీర్ బాబు కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఇది కూడా ‘సమ్మోహనం’ తరహాలోనే సినిమా నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా. ఇందులో కృతీశెట్టి నాయికగా నటించింది. ఈ సినిమాలతో పాటే నివేద థామస్, రెజీనా కసాండ్రా టైటిల్ రోల్ ప్లే చేసిన ‘శాకిని డాకిని’ మూవీ శుక్రవారం రాబోతోంది. కొరియన్ మూవీ ‘మిడ్ నైట్ రన్నర్స్’కు ఇది అఫీషియల్ రీమేక్. సుధీర్ వర్మ దీన్ని డైరెక్ట్ చేశారు. తాటి సునీతతో కలిసి సురేశ్ బాబు ఈ మూవీని నిర్మించారు.
ఇక ‘బిగ్ బాస్’ విజేత సన్నీ హీరోగా శ్రీనివాస్ వెలిగొండ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘సకల గుణాభిరామ’ చిత్రం, శ్యామ్ మండల రూపొందించిన ‘అం అః’, సగరెడ్డి తుమ్మ తెరకెక్కించిన ‘నేను కేరాఫ్ నువ్వు’ చిత్రాలు 16వ తేదీ విడుదల అవుతున్నాయి. అలానే ఎంతోకాలంగా వాయిదా పడుతూ వచ్చిన కిచ్చా సుదీప్ కన్నడ అనువాద చిత్రం ‘కె -3 – కోటికొక్కడు’ కూడా శుక్రవారం రిలీజ్ అవుతోంది. మరి ఈ సినిమాలలో ఏవేవి ప్రేక్షకాదరణ పొందుతాయో చూడాలి.