Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!

Tollywood

Tollywood

Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల సంగీత దర్శకుల ఎంపిక, మార్పుల అంశం దర్శకులు, నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. సినిమా షూటింగ్ సగం పూర్తయ్యాక లేదా పోస్ట్ ప్రొడక్షన్ దశకు వచ్చాక రీ-రికార్డింగ్ (RR), బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) కోసం ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్‌ను కాదని వేరొకరిని రంగంలోకి దించడం ఎక్కువైపోయింది. ఆశించిన స్థాయిలో అవుట్‌పుట్ రాకపోవడం, అనుకున్న సమయానికి హిట్ ట్యూన్స్ అందించలేకపోవడంతో స్టార్ హీరోల సినిమాలకు కూడా చివరి నిమిషంలో సంగీత దర్శకులను మార్చడం అనివార్యమవుతోంది.

తాజాగా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ చిత్రానికి కూడా ఇదే తరహా పరిస్థితి ఎదురైనట్లు సమాచారం. సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమా అంటే రవి బస్రూర్ పేరే వినిపిస్తుంది. అయితే హిట్ ట్యూన్స్ ఇవ్వడంలో ఆయన వెనుకపడ్డారనే విమర్శలు రావడంతో, కొన్ని పాటలు, మ్యూజిక్ కోసం రెండుసార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్‌దేవ్‌ను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. రవి బస్రూర్ ప్రాజెక్ట్‌లో కొనసాగుతున్నప్పటికీ, శాశ్వత్ సచ్‌దేవ్‌ను కూడా భాగస్వామిని చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ తరహా మార్పులు టాలీవుడ్‌లోని మరికొన్ని భారీ ప్రాజెక్టుల్లోనూ స్పష్టంగా కనిపించాయి. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ ప్రధాన సంగీత దర్శకుడిగా ఉన్నప్పటికీ, రీ-రికార్డింగ్ పనుల వేగం, నాణ్యత కోసం సామ్ సీఎస్‌ను రంగంలోకి దించి బీజీఎం వర్క్ చేయించుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి ముందు దేవిశ్రీ ప్రసాద్‌ను అనుకున్నప్పటికీ, తర్వాత ఆ స్థానంలోకి తమన్ వచ్చారు. మరోవైపు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కోసం మొదట హర్షవర్ధన్ రామేశ్వర్‌ను ఎంపిక చేసినా, డైరెక్టర్‌తో సరైన సింక్ కుదరకపోవడంతో మళ్లీ తన రెగ్యులర్ ఛాయిస్ తమన్‌కే బాధ్యతలు అప్పగించారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రానికీ ఇదే పరిస్థితి ఎదురైంది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నప్పటికీ, ప్రత్యేకంగా ఐటమ్ సాంగ్ కోసం భీమ్స్ సిసిరోలియోను రంగంలోకి దించారు. అంతేకాకుండా నేపథ్య సంగీతంలో దిట్ట అయిన కీరవాణి ఉండగానే, ‘మిరాయ్’ ఫేమ్ హరిగౌరతో మరికొంత వర్క్ చేయించుకున్నట్లు ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం పాన్-ఇండియా రేంజ్‌లో సినిమాల విజయానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అత్యంత కీలకంగా మారడంతో, క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడలేక మేకర్స్ చివరి క్షణంలో ఇలాంటి మార్పులకు మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది.