“కేజీఎఫ్-2” మూవీ ఏప్రిల్ 14న భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో థియేటర్లలో “కేజీఎఫ్-2″ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ సినిమా మరో రెండ్రోజుల్లోనే సినీ ప్రియులను థ్రిల్ చేయనుంది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో, అన్ని భాషల్లో సినిమాను శరవేగంగా ప్రమోట్ చేసుకుంటున్నారు ప్రశాంత్ నీల్ అండ్ టీం. ఇప్పటికే కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో నిర్వహించిన ప్రెస్ మీట్లతో పాటు పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న “కేజీఎఫ్ -2” స్టార్ యష్ సినిమా కోసం అలుపెరగకుండా తిరుగుతున్నారు. “కేజీఎఫ్-2” టీం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులపై దృష్టి పెట్టింది. ఈ మేరకు ఈరోజు ఉదయం తిరుపతిలో, మధ్యాహ్నం వైజాగ్ లో ప్రెస్ మీట్లలో పాల్గొన్నారు. అయితే తాజాగా వైజాగ్ లో జరిగిన “కేజీఎఫ్-2” ప్రెస్ మీట్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆ సీన్ చూస్తే మనవాళ్ళు రివేంజ్ తీర్చుకున్నారా ? అనిపించకమానదు.
Read Also : Pratik Gandhi : వెండితెరకెక్కబోతున్న జ్యోతిరావ్ పూలే చరిత్ర!
అసలేం జరిగిందంటే… “పుష్ప” విడుదల సమయంలో సినిమా ప్రమోషన్లకు సుకుమార్ టీంకు పెద్దగా టైం లేకపోయిందన్న మాట వాస్తవం. “పుష్ప”ను పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలని ప్లాన్ చేసిన సుకుమార్ అన్ని భాషల్లోనూ ప్రమోషనల్ కార్యక్రమాలను అల్లు అర్జున్, రష్మికలపై వదిలేశారు. వాళ్ళు గంటల వ్యవధిలోనే, ప్రత్యేక విమానంలో ఏమాత్రం విశ్రాంతి లేకుండా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈవెంట్లలో పాల్గొన్నారు. అలాగే కర్ణాటకలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా, అక్కడికి అల్లు అర్జున్ తన టీంతో కాస్త లేట్ గా వెళ్లారు. దీంతో ప్రెస్ మీట్ కు లేటుగా రావడమేంటి అంటూ కన్నడ మీడియా వాళ్లపై ఫైర్ అయ్యింది. దానికి అల్లు అర్జున్ వివరణ ఇచ్చుకోక తప్పలేదు. అయితే ఇప్పుడు “పుష్ప” సీన్ రిపీట్ అయ్యింది… కాకపోతే అది రివర్స్ లో… “కేజీఎఫ్-2” స్టార్ పై తెలుగు మీడియా ఫైర్ అయ్యింది.
ముందుగానే ఈ ప్రెస్ మీట్లు ప్లాన్ చేసుకున్న “కేజీఎఫ్-2” టీం తిరుపతి ప్రెస్ మీట్ ఉదయం 7 గంటలకు అని చెప్పి, 8.30 గంటలకు వచ్చారు. వైజాగ్ లో మధ్యాహ్నం 11 గంటలకు అని చెప్పి… 12.30కు వెళ్లారు. దీంతో తెలుగు మీడియా ప్రతినిధులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఓ విలేఖరి ప్రెస్ మీట్లో యష్ మొహం మీదే ఈ విషయాన్నీ అడిగేశాడు. మీరు ప్రెస్ మీట్ చెప్పిన టైం ఏంటి? వచ్చిన టైం ఏంటి ? గంటన్నర నుంచి ఇంతమంది జర్నలిస్టులు వెయిట్ చేస్తున్నారు… అంటూ ఫైర్ అయ్యాడు సదరు విలేఖరి. అయితే తనకు అసలేం జరుగుతుందో తెలీదని, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తున్నాను అని, 10 మినిట్స్ లేట్ అయినా తప్పేనని అంటూ యష్ సారీ చెప్పారు. మొత్తానికి మనోళ్లు రివేంజ్ తీర్చుకున్నారు. అంతేగా మరి… “పుష్ప” టీంకు అంటే టైం లేకపోయింది. మరి వీళ్లయితే ముందుగానే ప్లాన్ చేశారుగా అంటున్నారు నెటిజన్లు. ఏదేమైనా మనోళ్లు మామూలోళ్లు కాదు !