Gopichand: మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన 30వ చిత్రం ‘రామబాణం’. ఈ సినిమా ఇదే నెల 5వ తేదీ జనం ముందుకు వస్తోంది. విశేషం ఏమంటే… గోపీచంద్ తో పాటు కెరీర్ ప్రారంభించిన చాలామంది హీరోలు ఈ మైలు రాయిని ఇప్పటికీ దాటేశారు. అలానే గోపీచంద్ కంటే వెనక హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన కొందరు కూడా దీన్ని క్రాస్ చేసేశారు. నిజానికి ఎప్పుడు వచ్చామన్నది కాదు… హిట్ కొట్టామా లేదా అనేదే ఎవరికైనా ప్రధానం! ఆ రకంగా చూసినప్పుడు మంచి హిట్ కోసం కొంతకాలంగా గోపీచంద్ ఎదురు చూస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘రామబాణం’తో దాన్ని సాధిస్తానని నమ్ముతున్నాడు. ఇప్పటికే గోపీచంద్ , దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్ లో ‘లక్ష్యం, లౌక్యం’ చిత్రాలు విడుదలై మంచి విజయాన్ని సాధించడంతో ఈసారి హ్యాట్రిక్ ఖాయమనే మాట బాగా వినిపిస్తోంది.
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న 30వ చిత్రం ఈ యేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న విడుదల కాబోతోంది. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో నాని సరసన ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే శ్రుతీహాసన్ ఓ కీలక పాత్రను పోషిస్తోంది. మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కె. ఎస్. ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై భారీ ఎత్తున, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు.
అలానే యంగ్ టైగర్ ఎన్టీయార్ 30వ చిత్రం సైతం ప్రస్తుతం సెట్స్ పై ఉంది. యంగ్ టైగర్ ఎన్టీయార్, కొరటాల శివది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘జనతా గ్యారేజ్’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దాంతో సహజంగానే ఈ మలి చిత్రం మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాతో స్వర్గీయ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడంతో ఆ క్రేజ్ మరింత పెరిగింది. ఈ సినిమా వచ్చే యేడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. మరి ఇందులో ఎవరెవరు విజయాలను అందుకుంటారో చూడాలి!