పరభాషా నాయికల కోసం టాలీవుడ్ డోర్స్ ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. ఈ మధ్యలో కన్నడ భామలు అత్యధికంగా తెలుగు చిత్రసీమలోకి వచ్చారు. అయితే ఆ జోరు ఇప్పుడు కాస్తంత తగ్గింది. కానీ చిత్రంగా ఈ యేడాది శాండిల్ వుడ్ బ్యూటీ కృతీశెట్టి అత్యధిక అవకాశాలు అందుకుని, నయా హీరోయిన్స్ జాబితాలో టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఓవర్ ఆల్ గా చూసినప్పుడు ఈ యేడాది పరభాష భామల ఎంట్రీ కూడా బాగానే వుంది.
‘ఉప్పెన’తో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన కృతీశెట్టి తొలి చిత్రం విడుదలకు ముందే పలు అవకాశాలు అందుకుంది. ఆమె నటించిన రెండో సినిమా ‘శ్యామ్ సింగరాయ్’ సైతం తొలి యేడాదే విడుదల అవుతోంది. ఇక సంక్రాంతి కానుకగా వస్తుందని చెబుతున్న నాగార్జున, నాగచైతన్య ‘బంగార్రాజు’లోనూ కృతి శెట్టి నటిస్తోంది. సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ మూవీ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, నితిన్ ‘మాచర్ల నియోజవర్గం’ చిత్రాలలో కృతీ చేస్తోంది. ఇంకా పేరు నిర్ణయించని రామ్ – లింగుస్వామి బైలింగ్వల్ మూవీలోనే ఈ అమ్మడే కథానాయిక. ఆ రకంగా కృతి టాలీవుడ్ లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది.
ఈ యేడాది టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, చక్కని అవకాశాలు పొందిన మరో నాయిక అమృతా అయ్యర్. గతంలో డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులో కొద్దిపాటి గుర్తింపు తెచ్చుకున్న అమృతా అయ్యర్ ఈ యేడాది స్ట్రయిట్ తెలుగు సినిమా ‘రెడ్’తో జనం ముందుకు వచ్చింది. ఆ తర్వాత అదే నెలాఖరులో వచ్చిన ’30 రోజులలో ప్రేమించడం ఎలా?’లో సోలో హీరోయిన్ గా నటించింది. ఈ యేడాది చివరిలో రాబోతున్న శ్రీవిష్ణు ‘అర్జున ఫాల్గుణ’లోనూ అమృతా అయ్యరే హీరోయిన్. సో… ఆమె నటించిన మూడు చిత్రాలు ఒకే యేడాది విడుదలైనట్టు. ఇక తేజ సజ్జా సూపర్ హీరో మూవీ ‘హను -మాన్’లోనూ అమృత నాయికగా నటిస్తోంది.
తొలి చిత్రంతోనే సూపర్ హిట్ ను అందుకున్న చిన్నది ఫరియా అబ్దుల్లా. ‘జాతిరత్నాలు’ మూవీతో ఒక్కసారిగా టాలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టిలో పడిపోయిందీ పొడుగుకాళ్ళ సుందరి. ఈ కర్లింగ్ హెయిర్ బ్యూటీ ఆ మధ్య వచ్చిన అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చింది. అలానే నాగ్ – చైతూ మూవీ ‘బంగార్రాజు’లో ఓ స్పెషల్ సాంగ్ లో నర్తిస్తోంది. ఇక ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ తెరకెక్కిస్తున్న బైలింగ్వల్ మూవీలోనూ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది.
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన ‘రొమాంటిక్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కేతికాశర్మ. తొలి చిత్రంలో గ్లామర్ డాల్ గా నటించిన కేతిక… ఇటీవల వచ్చిన నాగశౌర్య ‘లక్ష్య’లో కాస్తంత అభినయానికి ఆస్కారం ఉన్న పాత్ర చేసింది. ప్రస్తుతం కేతిక శర్మ, వైష్ణవ్ తేజ్ హీరోగా బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న మూవీలో నటిస్తోంది.
తొలి చిత్రం విజయం సాధించకపోయినా, మళ్లీ అవకాశాలు పొందిన మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి. యంగ్ హీరో సుశాంత్ మూవీ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి, ఆ సినిమా విడుదలకు ముందు తన ఖాతాలో మరో రెండు సినిమాలు వేసుకుంది. మాస్ మహరాజా రవితేజ తో రమేశ్ వర్మ తెరకెక్కిస్తున్న ‘ఖిలాడీ’లోనూ, అడివి శేష్ హీరోగా నాని నిర్మించే ‘హిట్ -2’లోనూ మీనాక్షి చౌదరి నటిస్తోంది.
మలయాళ ముద్దుగుమ్మ, వింక్ గర్ల్ ప్రియా ప్రకాశ్ వారియర్ సైతం ఈ యేడాది నితిన్ ‘చెక్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది. అయితే ఇందులో ఆమెకు పెద్దంత ప్రాధాన్యమున్న పాత్ర దక్కలేదు. ఇదే సమయంలో యంగ్ హీరో తేజ సజ్జా సరసన మలయాళ రీమేక్ ‘ఇష్క్’లో చోటు దక్కించుకుంది ప్రియా ప్రకాశ్. బాధాకరం ఏమంటే…. ఈ సినిమా కూడా ఆమెకు కమర్షియల్ సక్సెస్ ను ఇవ్వలేకపోయింది. అయినా ప్రియా ప్రకాశ్ వారియర్ తెలుగులో అవకాశాల కోసం గట్టిగానే కృషి చేస్తోందని తెలుస్తోంది.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా నటించిన ‘తెల్లవారితే గురువారం’తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది మిషా నారంగ్. ఇదే యేడాది నవంబర్ లో విడుదలైన ‘మిస్సింగ్’లోనూ ఆమె నటించింది. ప్రస్తుతం ఆది సాయికుమార్ మూవీ ‘సీఎస్ఐ సనాతన్’లో మిషా నారంగ్ హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రముఖ కథానాయకుడు రాజశేఖర్, నటి, దర్శకురాలు జీవిత దంపతుల చిన్న కుమార్తె శివాత్మిక ఇప్పటికే ‘దొరసాని’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పుడు ఆమె సోదరి శివానీకి ఆ ఛాన్స్ దక్కింది. తేజ సజ్జా సరసన శివానీ నాయికగా నటించిన ‘అద్భుతం’ సినిమా ఇప్పటికే విడుదల కాగా, అదిత్ అరుణ్ తో కలిసి శివానీ నటించిన ‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ’ మూవీ డిసెంబర్ 24న వస్తోంది. ఈ రెండు సినిమాలూ ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. గ్లామర్ హీరోయిన్ గా కంటే పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రను శివానీ ‘అద్భుతం’లో చేసింది. మరికొన్ని సినిమాలూ ఆమె కిట్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’తో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన నేహాశెట్టి ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, సిద్దు జొన్నలగడ్డతో సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ‘నరుడి బ్రతుకు నటన’లో అవకాశం పొందింది.
‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నమ్రతా దామేకర్ కూ ఆ మూవీ విడుదలకు ముందే మరో ఛాన్స్ లభించింది. యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం మూవీ ‘సెబాస్టియన్ పి.సి. 524’లో నమ్రత హీరోయిన్ గా నటిస్తోంది.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన చిత్రం ‘పెళ్ళిసందడి’. గౌరీ రోణంకి దర్శకురాలిగా పరిచయమైన ఈ మూవీలో గ్లామర్ హీరోయిన్ గా నటించింది శ్రీలీల. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, శ్రీలీల అందానికి ఫిదా అయిన నిర్మాతలు కొందరు ఆమెకు అవకాశాలు ఇవ్వబోతున్నట్టు తెలిసింది. నితిన్, శర్వానంద్ చిత్రాలలో శ్రీలీల ఛాన్స్ దక్కించుకుందన్నది ఫిల్మ్ నగర్ సమాచారం.
బాలీవుడ్ లో కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దియా మీర్జా ‘వైల్డ్ డాగ్’ మూవీలో నాగార్జున సరసన నటించి తొలిసారి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. అలానే ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేత ‘సత్యం’ రామలింగరాజు కోడలు, డాన్సర్ సంధ్యారాజ్ ‘నాట్యం’ సినిమాతో కథానాయికగా తెలుగువారి ముందుకు వచ్చారు.
ఈ యేడాది యంగ్ హీరోస్ సరసన నటిస్తూ, కొత్త అమ్మాయిలు కొందరు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవటంతో వారికి సెకండ్ ఛాన్స్ దక్కలేదు. శ్రీ విష్ణు ‘గాలి సంపత్’తో లవ్లీసింగ్, కార్తికేయ ‘రాజా విక్రమార్క’తో తన్యా రవీంద్రన్, ఆనంద్ దేవరకొండ ‘పుష్పక విమానం’తో గీతాసైనీ, రాజ్ తరుణ్ ‘అనుభవించు రాజా’తో కాశిష్ ఖాన్, ‘అల్లరి’ నరేశ్ ‘నాంది’తో నవమి గాయక్, మంచు విష్ణు ‘మోసగాళ్ళు’తో రూహీ సింగ్, సత్య ‘వివాహ భోజనంబు’తో ఆర్జవి, సాగర్ ‘షాదీ ముబారక్’తో దృశ్యా రఘునాథ్, రామ్ కార్తీక్ ‘ఎఫ్.యు.సి.కె.’తో అమ్ము అభిరామి తదితరులు టాలీవుడ్ లో తమ అదృష్టం పరీక్షించుకున్నారు.
వీరితో పాటే రాశీ సింగ్ (శశి, పోస్టర్), శ్రీజితా ఘోష్ (శుక్ర), దివ్య పాండే (జి), తేజు అనుపోజు (వలస, హనీట్రాప్), సాషా సింగ్ (క్లైమాక్స్), మోనికా రెడ్డి (ధ్యాంక్యూ బ్రదర్), కృష్ణవేణి (అర్థ శతాబ్దం) వంటి వారు కూడా కథానాయికలుగా నటించారు. వెంటనే వీరందరికీ అవకాశాలు రాకపోయినా, ప్రతిభ అంటూ ఉంటే మలి అవకాశం కొంతకాలానికైనా దక్కకపోదు. వీరిలో ఎవరు రాబోయే రోజుల్లో వెండితెరపై మరోసారి మెరియబోతారో చూడాలి.