2023 మొదలై నెల రోజులు గడవగానే టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. వీవీ వినాయక్, శ్రీను వైట్ల లాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ కి గురువు అయిన దర్శకుడు సాగర్ (విద్యాసాగర్ రెడ్డి) ఈరోజు ఉదయం 6 గంటలకు చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విద్యాసాగర్ రెడ్డి, ట్రీట్మెంట్ తీసుకుంటూ హాస్పిటల్ లోనే మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలోనే జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
దర్శకుడు బి.వి.ప్రసాద్ వద్దనే సహాయ దర్శకుడుగా, ఆ తర్వాత ఎ. కోదండరామిరెడ్డి వద్ద సహాయ దర్శకుడుగా 12–13 ఏళ్ళు పని చేసిన తర్వాత సాగర్ దర్శకత్వంలో మొదటి సినిమా ‘రాకాసిలోయ’ అనే సినిమా తెరకెక్కింది. నరేష్, విజయశాంతి నటించిన ఈ సినిమా తర్వాత సాగర్ దాదాపు 30 సినిమాలని డైరెక్ట్ చేశాడు. ఇందులో అత్యధిక శాతం హిట్స్ గానే నిలిచాయి. సూపర్ స్టార్ కృష్ణతో ‘అమ్మ దొంగ’ సినిమా చేసి హిట్ కొట్టాడు సాగర్. సుమన్ తో రెండు సినిమాలని చేసిన సాగర్ దర్శకత్వం వహించిన ‘రామసక్కనోడు’ చిత్రానికి మూడు నంది పురస్కారాలు లభించాయి. 2002లో రవితేజతో ‘అన్వేషణ’ అనే సినిమాని సాగర్ డైరెక్ట్ చేశాడు కానీ అది ఎక్కువ మందికి తెలియలేదు.
తెలుగు ఫిలిం అసోసియేషన్ కు అధ్యక్షుడిగా కూడా వ్యవహరించిన సాగర్ ది గుంటూరు జిల్లా. నిడమర్రు గ్రామంలో 1952 మార్చ్ 1న జన్మించిన సాగర్, ఎస్సెల్సీ వరకూ చదువుకోని అటు పైన సినిమాల వైపు వచ్చేసాడు. కెరీర్ స్టార్టింగ్ లో ఎడిటర్ గా కూడా వర్క్ చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అనుకోకుండా వచ్చి తన కష్టంతో పైకొచ్చిన సాగర్ మరణించడం ఇండస్ట్రీకి తీరని లోటనే చెప్పాలి.