బాలీవుడ్ లో యంగ్ యాక్షన్ స్టార్ గా సాగుతున్న టైగర్ ష్రాఫ్ త్వరలోనే ‘హీరోపంతి-2’తో జనాన్ని అలరించనున్నాడు. ఈ సినిమా ట్రైలర్స్ చూసిన తరువాత టైగర్ సోదరి కృష్ణ ష్రాఫ్ తన అన్న హాలీవుడ్ స్టార్ లా కనిపిస్తున్నాడని కామెంట్ చేసింది. ఇదే విషయాన్ని టైగర్ ను కొందరు ప్రశ్నించగా, తన జీవితధ్యేయం హాలీవుడ్ మూవీలో నటించడమేనని సమాధానమిచ్చాడు. ఇప్పటికే హాలీవుడ్ కొన్ని సినిమాల కోసం తాను వెళ్ళి ఆడిషన్స్ లో పాల్గొన్నానని, అయితే అవి వర్కవుట్ కాలేదని చోటా ష్రాఫ్ తెలిపాడు.
హాలీవుడ్ లో యాక్షన్ మూవీస్ లోనూ సహజత్వానికే పెద్ద పీట వేసే ప్రయత్నం చేస్తుంటారు. అందువల్ల అక్కడి యాక్షన్ ఎపిసోడ్స్ చూస్తే, మన పాత చిత్రాల్లో ఫైటింగ్స్ లాగే ఉంటాయి. అయితే ఆసియా సూపర్ స్టార్ జాకీ ష్రాఫ్ అతివేగంగా చేసే యాక్షన్ సీన్స్ హాలీవుడ్ జనాన్ని సైతం ఆకట్టుకున్నాయి. అందువల్ల జాకీ అక్కడి సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. ఆ తరువాత ఆ తరహా ఫాస్ట్ యాక్షన్ సినిమాల్లో హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూయిజ్ నటించి అలరించాడు. ఇప్పటికీ ఆయనే ఆ పంథాలో సాగుతూ ఉన్నాడు. కాబట్టి తన వయసు యాక్షన్ హీరోకు హాలీవుడ్ లో తప్పకుండా అవకాశం ఉంటుందని టైగర్ ష్రాఫ్ భావిస్తున్నాడు. ఇంతకు ముందు తనకు తానుగా వెళ్ళి అక్కడి ఆడిషన్స్ లో పాల్గొన్నానని చెప్పాడు. ఇకపై ఏదైనా హాలీవుడ్ ఏజెన్సీ సంస్థ ద్వారా కానీ, ఏజెంట్ ద్వారా కానీ హాలీవుడ్ మూవీలో ఛాన్స్ కోసం ప్రయత్నిస్తాననీ అంటున్నాడు టైగర్. శుక్రవారం (ఏప్రిల్ 29న) రాబోయే తన ‘హీరోపంతి-2’తో ఈ యాక్షన్ హీరో ఏ రీతిన అలరిస్తాడో, ఆ తరువాత హాలీవుడ్ లో ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడో చూద్దాం.