కరోనా తర్వాత ఓటీటీ పుంజుకోవడంతో నటీనటులందరూ పుల్ బిజీ అయ్యారు. వారిలో హీరో త్రిగుణ్ ఒకరు. త్రిగుణ్ నటించిన కొండా మురళి, కొండా సురేఖ బయోపిక్ ‘కొండా’ 23న విడుదల కానుంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురించి, తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ ల గురించి విలేకరులకు తెలియచేశాడు త్రిగుణ్. శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై కొండా సుష్మితా పటేల్ నిర్మించిన ‘కొండా’ సినిమాలో సురేఖగా ఇర్రామోర్ నటించింది.
ఈ సందర్భంగా త్రిగుణ్ మాట్లాడుతూ ‘వర్మ కొండా పాత్రకు ఎంపిక చేయటంతో పెయిన్, ప్లెజర్ రెండూ అనుభవించాను. నిజానికి నా ‘కథ’ విడుదలకు ముందు వర్మను కలిసి సినిమా చేయమని అడిగా. అప్పట్లో రొమాంటిక్ హీరోలా ఉంటాడు. క్యూట్ బాయ్. నా స్టైల్ కి పనికి రాడు అన్నారు. ఆ తర్వాత మళ్ళీ నాలుగేళ్ళ క్రితం కలిశా. చేద్దాం అన్నారు. ఆ తర్వాత స్క్రిప్ట్ దొరికింది. మనం మురళి మీద సినిమా చేస్తున్నాం. నువ్వు ఆయన రోల్ చేస్తున్నావు అన్నారు. ఇక వర్మ బయోపిక్స్ లో ‘రక్త చరిత్ర’, ‘వంగవీటి’ క్యారెక్టర్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్. ఎక్కువ పాత్రల నడుస్తాయి. ‘కొండా’ బయో ఫిక్షన్. బయోపిక్, బయో ఫిక్షన్ మధ్య వ్యత్యాసం ఉంది’ అన్నాడు
ఇంకా మాట్లాడుతూ ”ఈ సినిమా కోసం ఆరేడు కేజీల బరువు పెరిగా. ఎమోషన్ పీక్స్‌లో ఉంటుంది. ఈ బయోపిక్ తర్వాత నా జీవితమే మారింది. నన్ను నేను రీ బ్రాండ్ చేసుకోవటానికే పేరు మార్చుకున్నా. ఈ సినిమా కాకుండా నేను నటించిన ‘ప్రేమ దేశం’ విడుదల రెడీగా ఉంది. అందులో నేను, మేఘా ఆకాష్ జంటగా నటించాం. ఆ చిత్రానికి మణిశర్మ గారు సంగీతం అందించారు. ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అని మరో సినిమా కూడా విడుదలకు రెడీ అయ్యింది. దేవ కట్టా శిష్యుడు సురేష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. మిస్కిన్ దర్శకత్వంలో మరో సినిమా ఉంది. దానికి ఆయనే సంగీతం అందిస్తుండటం విశేషం. పర్పుల్ రాక్ బ్యానర్ లో ‘లైన్‌మేన్’ అని సినిమా చేస్తున్నా. ఇవి కాకుండా ‘కిరాయి’ అని ఇంకో సినిమా కూడా ఉంది” అని అంటున్నాడు త్రిగుణ్. మరి పేరు మార్పుతో త్రిగుణ్ దశ తిరుగుతుందేమో చూడాలి.