Telugu Cinema: లాస్ట్ వీకెండ్ లో డబ్బింగ్ తో కలిసి ఏడు సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ఒక్క ‘విరూపాక్ష’ మాత్రమే బాక్సాఫీస్ బరిలో తన సత్తాను చాటింది. ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లోనే వరల్డ్ వైడ్ 50 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం విశేషం. దాంతో సమ్మర్ రిలీజెస్ లో ఓ కొత్త ఊపు వచ్చింది. ఎందుకంటే ఈ నెలలో విడుదలైన ‘రావణాసుర, మీటర్, శాకుంతలం’ చిత్రాలన్నీ తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఆ లోటును సాయిధరమ్ తేజ తన ‘విరూపాక్ష’తో భర్తీ చేశాడు.
ఇక ఈ వారంలో అక్కినేని అభిమానుల దాహార్తిని తీర్చడానికి ‘ఏజెంట్’ మూవీ 28వ తేదీ జనం ముందుకు రాబోతోంది. అనిల్ సుంకరకు చెందిన ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు సురేందర్ రెడ్డి సైతం నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. మలయాళీ సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టితో పాటే బాలీవుడ్ యాక్టర్ డినో మోరియా ఇందులో కీలక పాత్రను పోషించాడు. సాక్షి వైద్య ఈ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాతో పాటే మణిరత్నం మాగ్నమ్ ఓపస్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్ -2’ కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. దీని మొదటి భాగం తమిళంలో బాగానే ఆదరణ పొందింది కానీ తెలుగులో మాత్రం సో… సో… గానే నడించింది. ఆ సినిమాను పంపిణీ చేసిన ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజే ఇప్పుడీ సినిమా ద్వితీయ భాగాన్ని సైతం తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
ఈ నెల 28వ తేదీనే సింగిల్ క్యారెక్టర్ మూవీగా తెరకెక్కిన ‘రా… రా… పెనిమిటి’ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే పలు తెలుగు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నందితా శ్వేత ఈ సింగిల్ క్యారెక్టర్ ను పోషించింది. ఇక ఆ మర్నాడు అంటే శనివారం చేతన్ చీను నటించిన ‘విద్యార్థి’ మూవీ రిలీజ్ కాబోతోంది. ఆ రకంగా ఈ వీకెండ్ లో మొత్తం నాలుగు సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. అందులో అందరి చూపు ‘ఏజెంట్’ అండ్ ‘పి.ఎస్-2’ మీదనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు!