Weekend Movies: లాస్ట్ వీకెండ్ లో రెండు అనువాద చిత్రాలతో కలిపి మొత్తం తొమ్మిది సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. కానీ బ్యాడ్ లక్… అందులో ఒక్కటి కూడా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. గత వారం వచ్చిన వాటిలో ‘కస్టడీ’ కలెక్షన్లు మాత్రమే సిటీస్ లో కొంతలో కొంత బెటర్ గా ఉన్నాయి. కానీ ఆ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను రీచ్ కావడంలో విఫలమైంది. ఇదిలా ఉంటే… ఈ వారం రెండు అనువాద చిత్రాలతో కలిసి నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో రెండు సినిమాలు ఇవాళ విడుదలయ్యాయి. వాటిలో చెప్పుకోదగ్గది స్వప్న సినిమా బ్యానర్ లో వచ్చిన ‘అన్నీ మంచి శకునములే’. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా బి. వి. నందినిరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాకు పెద్దంత పాజిటివ్ టాక్ రావడం లేదు. కలెక్షన్లు కూడా చాలా పూర్ గా ఉన్నాయన్నది ట్రేడ్ వర్గాల చెబుతున్న మాట. హాట్ సమ్మర్ లో కూల్ బ్రీజ్ ను ఈ సినిమా అందిస్తుందని ఆశించిన వారికి నిరాశే మిగిలేట్టుగా ఉంది. అలానే ఇవాళ హాలీవుడ్ మూవీ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరిస్ 10’ కూడా తెలుగులో అనువాదమై జనం ముందుకు వచ్చింది. ఈ సీరిస్ పట్ల ప్రేక్షకులకు కొద్దో గొప్పో క్యూరియాసిటీ ఉండటంతో ఈ సినిమాకు పాజిటివ్ టాకే వస్తోంది.
‘బిచ్చగాడు-2’ పైనే అందరి దృష్టి!
విజయ్ ఆంటోనీ స్వీయ నిర్మాణంలో శశి దర్శకత్వంలో 2016లో వచ్చిన ‘బిచ్చగాడు’ అప్పట్లో తమిళ, తెలుగు భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా వేసిన పునాదితోనే ఆ తర్వాత విజయ్ ఆంటోనీ నటించిన ప్రతి తమిళ చిత్రమూ తెలుగులోనూ విడుదలవుతూ వచ్చింది. అప్పటి నుండి అనేక మంది ‘బిచ్చగాడు’కు సీక్వెల్ చేయమని విజయ్ ఆంటోని అడుగుతూనే ఉన్నారు. అయితే ఇంతకాలానికి ఆయన స్వీయ దర్శకత్వంలోనే ‘బిచ్చగాడు-2’ను నిర్మించారు. కావ్యాథాపర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా శుక్రవారం జనం ముందుకు వస్తోంది. బేసికల్ గా సంగీత దర్శకుడు అయిన విజయ్ ఆంటోని ఈ సినిమాకు సంగీతాన్ని అందించడంతో పాటు ఎడిటింగ్ పనులూ చేపట్టాడు. ఈ సినిమాను తెలుగులో ఉషా పిక్చర్స్ కు చెందిన వీరమ నాయుడు విడుదల చేస్తున్నారు. ఈ మూవీ విజయంపై విజయ్ ఆంటోని థీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రియాంక డే ప్రధాన పాత్ర పోషించిన ‘హసీనా’ సినిమా సైతం శుక్రవారమే విడుదల అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో నవీన్ ఇరగాని దర్శకత్వంలో దీన్ని తన్వీర్ ఎండీ నిర్మించగా, ఎస్. రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో తన్వీర్, సాయితేజ గంజి, శివగంగ, ఆకాష్ లాల్, విశిష్ట నారాయణ, అభినవ్, శ్రేష్ట ప్రధాన పాత్రలు పోషించారు. షారుఖ్ షేక్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాకు నవనీత్ చారి నేపథ్య సంగీతం అందించారు. ఈ తరహా చిత్రాలను ఆదరించే ప్రేక్షకులు ఎప్పుడూ ఉంటారని, వారు తమ చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే యంగ్ టైగర్ ఎన్టీయార్ పుట్టిన రోజును పురస్కరించుకుని 19న ‘ఆది’, 20న ‘సింహాద్రి’ చిత్రాలు రీ-రిలీజ్ అవుతున్నాయి.