సెప్టెంబర్ నెలలో ఐదు శుక్రవారాలు వచ్చాయి. ఇప్పటికే మూడు ఫ్రైడేస్ వెళ్ళిపోయాయి. కానీ ఒక్కటంటే ఒక్క సాలీడ్ హిట్ కూడా ఈ నెలలో పడలేదు. దాంతో ఈ వారంలో విడుదల కాబోతున్న సినిమాల మీద అందరూ దృష్టి పెట్టడం మొదలెట్టారు. కానీ నిజానికి ఈ వారంలోనూ గట్టిగా హోప్స్ పెట్టుకునే సినిమా లేదీ లేదనే చెప్పాలి. ఈ గురువారం ‘పగ పగ పగ’ అనే సినిమా మొదటగా విడుదల అవుతోంది. అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సంగీత దర్శకుడు కోటి స్వరాలు సమకూర్చడంతో పాటు ఓ కీలక పాత్రనూ పోషించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని రవి శ్రీదుర్గాప్రసాద్ దర్శకత్వంలో సుంకర సత్యనారాయణ నిర్మించారు.
ఇక ఫ్రై డే విడుదల కాబోతున్న సినిమాల్లో ప్రధానమైనవి నాగశౌర్య నటిస్తున్న ‘కృష్ణ వ్రింద విహారి’, శ్రీవిష్ణు నటిస్తున్న ‘అల్లూరి’, కీరవాణి తనయుడు శ్రీసింహా నటించిన ‘దొంగలున్నారు జాగ్రత్త’. “కృష్ణ వ్రింద విహారి’ని నాగశౌర్య తల్లి ఉషా ముల్పూరి నిర్మించగా, అనీష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ మూవీతో షెర్లీ సేటియా హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు సంగీతాన్ని అందించాడు. ఇక శ్రీవిష్ణు ‘అల్లూరి’ మూవీని బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తుండగా, దీనితో ప్రదీప్ వర్మ డైరెక్టర్ గానూ, కయ్యదు లోహర్ హీరోయిన్ గానూ పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరరచన చేశారు. శ్రీవిష్ణు పోలీస్ గా నటిస్తున్న ఈ సినిమా ఆ డిపార్ట్ మెంట్ కు గర్వకారణంగా ఉంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా నటిస్తున్న ‘దొంగలున్నారు జాగ్రత్త’లో ప్రీతి అస్రాణి హీరోయిన్ కాగా దర్శకుడిగా సతీశ్ త్రిపుర పరిచయం అవుతున్నాడు. తెలుగులో తెరకెక్కుతున్న ఈ తొలి సర్వైవల్ థ్రిల్లర్ మూవీకి కీరవాణి మరో తనయుడు కాలభైరవ సంగీతం అందించాడు. ఈ మూడు సినిమాలతో పాటు ఇదే రోజున ‘బెడ్ లైట్’, ‘ఇక్షు’, ‘శ్రీరంగనాయక’ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఇవన్నీ థియేటర్లలో సందడి చేయబోతుంటే, తమన్నా నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ‘బబ్లీ బౌనర్స్’ శుక్రవారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కాబోతోంది.