లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర పోషించిన ‘హ్యాపీ బర్త్ డే’ మూవీ ఈ నెల 8న విడుదల కాబోతోంది. అయితే ఇది అందరూ అనుకుంటున్నట్టు ఉమెన్ సెంట్రిక్ మూవీ కాదని, ఇందులో తనతో సహా ఇతర ప్రధాన పాత్రలు పోషించిన వారందరి పాత్రలు ప్రాధాన్యమైనవేనని లావణ్య త్రిపాఠి చెబుతోంది. దర్శకుడు రితేశ్ రాణా కథ చెప్పినప్పుడు కొత్తగా అనిపించిందని, సర్రియల్ వరల్డ్ థాట్ చాలా ఎగ్జయిట్ చేసిందని ఆమె తెలిపింది. తనను చాలామంది సీరియస్ పర్శన్ అనుకుంటారని, బహుశా తాను చేసిన పాత్రల వల్ల అలాంటి అభిప్రాయానికి వాళ్ళు వచ్చి ఉండొచ్చని బట్ నిజజీవితంలో తాను జోవియల్ గా ఉంటానని లావణ్య చెప్పింది. బేసికల్ గా జిమ్, బాక్సింగ్ చేసే తాను ఈ సినిమాలో తొలిసారి యాక్షన్ సన్నివేశాల్లో నటించానని, ఇందులోని హ్యాపీ పాత్రను చాలా ఎంజాయ్ చేశానని, అయితే మేకప్ మాత్రం కొంచెం కష్టంగా అనిపించేదని, అలాగే గన్స్ ని క్యారీ చేయడం కూడా ఇబ్బంది అనిపించిందని, ఒకొక్క గన్ 9 కేజీలు వరకూ ఉండేదని, దాన్ని మోస్తూ షూట్ చేయడం అంత సులువు కాద’ని తెలిపింది.
లావణ్య త్రిపాఠి నటించిన తొలి చిత్రం ‘అందాల రాక్షసి’ విడుదలై పదేళ్ళు కావస్తోంది. ఈ సందర్బంగా తన సినీ ప్రయాణం గురించి చెబుతూ, ”మొదటి సినిమా ‘అందాల రాక్షసి’లో మిథున పాత్ర చేసినప్పుడు నటన నాకు కొత్త. ఆ సినిమాలో ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. తర్వాత చేసిన పాత్రలన్నీ కేక్ వాక్ లానే చేశాను. ఐతే చాలా రోజుల తర్వాత మళ్ళీ ‘హ్యాపీ’ పాత్ర నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇందులోనూ నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను” అని చెప్పింది. ప్రస్తుతం తాను ఉన్న పోజిషన్, సినిమాల ఎంపిక గురించి మాట్లాడుతూ, ”పదేళ్ళుగా ఈ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. అదే గొప్ప ఆనందం. అందరూ నెంబర్ వన్ కి వెళ్ళాలని వుండదు. నా వర్క్ ని ఎంజాయ్ చేస్తున్నాను. ఎలాంటి ఒత్తిడి తీసుకోను. మనసుకు నచ్చిన పాత్రలు చేస్తున్నాను. నా ఈ ప్రయాణం సంతృప్తికరంగా వుంది. నేను కథల ఎంపికలో కొంచెం పర్టిక్యులర్ గా వుంటాను. ఒక నటిగా బలమైన పాత్రలు చేయాలని అనుకుంటాను. చేసిన పాత్రలే చేయడం నాకు నచ్చదు. బహుశా దీని వలన సినిమాలు తగ్గించినట్లు అనిపించవచ్చు” అని చెప్పింది. ప్రస్తుతం తమిళంలో అథర్వ తో ఓ సినిమా చేస్తున్నానని, అది దాదాపుగా షూటింగ్ పూర్తి కావచ్చందని లావణ్య త్రిపాఠి తెలిపింది. మరి ‘హ్యాపీ బర్త్ డే’ ఆమెకు ఏ స్థాయి హ్యాపీనెస్ ను అందిస్తుందో చూడాలి.