కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కాస్తంత తగ్గుముఖం పట్టడంతో తమిళనాడు ప్రభుత్వం సోమవారం నుండి ధియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి ఇస్తూ శనివారం జీవోను జారీ చేసింది. అయితే ఏపీలో మాదిరిగా యాభై శాతం ఆక్యుపెన్సీతోనే సినిమాను ప్రదర్శించాల్సి ఉంటుంది. దాంతో రోజుకు కేవలం మూడు ఆటలతో సరిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తమిళనాడుకు చెందిన సినిమా జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో చాలా రంగాలకు కరోనా నిబంధనల నుండి ఇప్పటికే సడలింపు ఇచ్చారు. కానీ సినిమా థియేటర్లను తెరవడానికి మాత్రం ప్రభుత్వం ససేమిరా అంది.
ఇటీవల తమిళనాడు థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు రాష్ట్ర సమాచార శాఖామంత్రి ఎంపీ స్వామినాథన్ కు కలిసి సినిమాల ప్రదర్శనకు అనుమతి ఇవ్వమని కోరారు. ఆ తర్వాత సీఎం స్టాలిన్ తో జరిగిన సమావేశంలో ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించింది. ఏప్రిల్ 26న థియేటర్లను మూసేసిన ఓనర్లంతా… ఈ నెల 23 నుండి తిరిగి వాటిని తెరిచే ప్రయత్నాల్లో పడ్డారు. ఇంతవరకూ ఓటీటీల వైపు దృష్టి సారించిన నిర్మాతలు కూడా ఇక థియేటర్లలోనే తమ చిత్రాలను విడుదల చేస్తామని చెబుతున్నారు. అలా ఈ జీవో రాగానే స్పందించిన మొదటి వ్యక్తి విజయ్ ఆంటోని. అతను నటించిన ‘కోడియిల్ ఒరువన్’ మే 14న విడుదల కావాల్సింది. కానీ థియేటర్లు మూత పడటంతో ఆగిపోయింది. అతి త్వరలోనే తన చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తానని విజయ్ ఆంటోనీ తెలిపాడు. ఈ సినిమా తెలుగులో ‘విజయ్ రాఘవన్’గా డబ్ అయ్యింది. ఈ రెండు భాషల్లోనూ ఒకేసారి మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది.