ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హడావుడే సృష్టించాయి. మనశంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారి నారి నడుమ మురారి, అనగనగ ఒక రాజు వంటి చిత్రాలు విడుదలతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు రాబట్టాయి. పండుగ వాతావరణం, కుటుంబ ప్రేక్షకుల సందడి కలిసి ఈ సినిమాలకు మంచి ఆదరణ దక్కింది. రాజాసాబ్ మాత్రం ఆడియెన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ముఖ్యంగా సంక్రాంతి హాలిడేస్ ఉండటంతో గత కొన్ని రోజులుగా థియేటర్లు హౌస్‌ఫుల్ షోస్‌తో నడిచాయి. ఫెస్టివల్ కోసం ఊర్లకు వచ్చిన పట్నం వాసులు, సెలవుల్లో ఉన్న విద్యార్థులు సినిమా థియేటర్స్ వైపు పరిగెట్టడంతో కలెక్షన్లు ఆశించిన దానికంటే మెరుగ్గా నమోదయ్యాయి. ఈ నాలుగు సినిమాలు తమ తమ కంటెంట్‌తో వేర్వేరు వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
Also Read : Big Boss Tamil : తమిళ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ గా స్టార్ లేడి
అయితే ఈ సినిమాల అసలు రంగు తెలిసే సమయం ఈ రోజు నుండి స్టార్ట్ అవుతోంది. సంక్రాంతి సెలవులు పూర్తయ్యాయి. తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి, స్కూళ్లు, కాలేజీలు కూడా రీ ఓపెన్ అయ్యాయి. దీంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యలో కొంత తగ్గుదల ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇకపై వీక్‌డేస్‌లో ఈ సినిమాలు ఎంతమేర వసూళ్లు రాబడతాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. పాజిటివ్ టాక్‌ను ఎంతవరకు నిలబెట్టుకుంటాయో, ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగించగలవో అన్నదానిపై ఈ సినిమాల తుది ఫలితం ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంక్రాంతి తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడగలిగితేనే ఈ సినిమాలకు నిజమైన విజయం దక్కినట్లవుతుంది.