RRR: ఆస్కార్ నామినేషన్స్ లో మన ‘ట్రిపుల్ ఆర్’ ఒకే ఒక్క ‘ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలోనే నామినేషన్ సంపాదించింది. ‘ట్రిపుల్ ఆర్’ కోసం కీరవాణి బాణీలకు అనువుగా చంద్రబోస్ రాసిన “నాటు నాటు…” పాట ఈ గౌరవంతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులూ సంపాదించింది. అయితే ఆస్కార్ అవార్డు దక్కితే వచ్చే ఆ కిక్కే వేరబ్బా అంటున్నారు అభిమానులు. చిత్రమేమిటో కానీ, ఆస్కార్ సభ్యులు సైతం ఈ పాటనే ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు సమాచారం. దక్కింది ఒకే నామినేషన్ అయినా ‘ట్రిపుల్ ఆర్’లోని “నాటు నాటు…” సాంగ్ ఆస్కార్ వేదికపై ఓ ప్రత్యేక ఆకర్షణ కానుందని తెలుస్తోంది. మార్చి 12వ తేదీ ఆదివారం సాయంత్రం అమెరికాలోని లాస్ ఏంజెలిస్ లో డాల్బీ థియేటర్ వేదికగా ‘ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం’ సాగనుంది. మన కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ఈ వేడుక మొదలు కానుంది. ఈ సారి ప్రముఖ టీవీ హోస్ట్, కమెడియన్ జేమ్స్ క్రిస్టియన్ కిమ్మెల్ ఆస్కార్ వేడుకలో హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇంతకు ముందు రెండు సార్లు ఆస్కార్ హోస్ట్ గా వ్యవహరించిన కిమ్మెల్ కు ఇది ముచ్చటగా మూడోసారి కావడం విశేషం!
Oscar 2023: ఆస్కార్ బరిలో ఆ రెండు సినిమాలు!
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేషన్స్ సంపాదించిన వారు ఆస్కార్ వేదికపై లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వనున్నారు. అందులో భాగంగానే మన ‘ట్రిపుల్ ఆర్’లోని “నాటు నాటు…” పాటను కీరవాణి స్వరకల్పనలో గాయకుడు కాలభైరవ లైవ్ ఇవ్వబోతున్నారు. అలాగే ‘బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్’లోని “లిఫ్ట్ మీ అప్…” పాట పాడిన రిహానా సైతం నామినేషన్ పొందిన పాటతో లైవ్ ఇస్తారు. ‘టాప్ గన్: మేవరిక్’లో “హోల్డ్ మై హ్యాండ్…” పాట పాడిన లేడీ గగా సైతం లైవ్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరం ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో విల్ స్మిత్, క్రిస్ రాక్ ను చెంప దెబ్బ కొట్టిన నేపథ్యంలో అలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ సారి ప్రత్యేకంగా ‘క్రైసిస్ టీమ్’ను ఏర్పాటు చేశారు. మిగతా పాటల కన్నా మన “నాటు నాటు…” సాంగ్ లైవ్ పెర్ఫామెన్స్ సమయంలోనే ఈ క్రైసిస్ టీమ్ అప్రమత్తంగా ఉండాలనీ భావిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే, ఆ పాట చెవుల పడితే చాలు ఇప్పటికే ఆస్కార్ సభ్యులు చిందులు వేస్తున్నారు. కాబట్టి, లైవ్ పెర్ఫామెన్స్ లో “నాటు నాటు…”కు డాన్స్ చేసేవారు ఉంటారు. వారు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే గొడవలు చోటు చేసుకొనే ప్రమాదమూ ఉందంటున్నారు. చూద్దాం… “నాటు నాటు నాటు నాటు…” ఏం చేస్తుందో!